సాహిత్యతత్త్వము తెలిసికొను భాగ్యము. ఆపిమ్మట నాయనగారి నిర్యాణము. పెదతండ్రి సుబ్బారాయశాస్త్రిగారుకూడ గతించినారు. తండ్రుల నెడబాసిన తనయుడు వారి యుపదేశములు నెమరునకు దెచ్చుకొనుచు, వారి రచనలు పారాయణము చేసికొనుచు గొంతకాలము గడపెను. కూచివారి యాచార్యకము కృష్ణశాస్త్రి యనూచానమైన ప్రతిభాసంపదకు మెఱవడి కలిగించినది. మంచి చుఱుకైన బుద్ధి. విన్నది కన్నది వెంటనే పట్టుకొను నైశిత్యము! అప్పటి కప్పుడే కనబడిన గ్రంథమెల్ల జదివినాడు. 'స్కూలుఫైనలు' పరీక్షలో నుత్తీర్ణుడైన నాటికి వయస్సు పదునైదు సంవత్సరములు . పయిచదువున కొకయేడు ఆగవలసి వచ్చినది. ఈ సంవత్సరములో నాంధ్రసాహిత్య పాఠము. గ్రాంథిక వ్యావహారిక భాషావివాదము పెల్లురేగు నాకాలము కృష్ణశాస్త్రి ప్రభృతులకు వినోదస్థానము.
నాడు కాకినాడలోని కళాశాలకు రఘుపతి వేంకటరత్నము నాయుడుగారి యాధ్యక్ష్యము. నాయుడుగారి యుపన్యాసములు కృష్ణశాస్త్రికి గ్రొత్త యుత్తేజనము కలిగించినవి. ఆయనలోని యాధ్యాత్మిక జిజ్ఞాస, మార్గదర్శకమైనది. 1919 లో 'ఇంటరు' లో గెలుపు. 1918 నాటికి బి.ఏ. పట్టభద్రత. విద్యార్థిదశలోనే బైబిలు, క్రాన్, భగవద్గీతలలోని మెలకువలు, వెలుగులు నాయుడుగారు చూపించినారు. రామమోహనరాయల సిద్ధాంతములు, సాహిత్యములో అప్పారావుగారి పోకడలు గుండెకు పట్టుకొన్నవి.
ఇంక, విద్యార్థిదశదాటిన కృష్ణశాస్త్రిగారికి భాషా-సంఘసంస్కారములు కావలయునన్న భావము దృడపడినది. కాకినాడలో బ్రహ్మసమాజము నాటకసమాజము వీరి సంస్కరణోద్దేశమున కొకదీప్తి కలిగించినవి. మొదట 'మిషన్' స్కూలులో నుద్యోగము. బ్రహ్మసమాజములో విడుమర లేని కృషి. 1919 సంవత్సరమునుండి కృష్ణశాస్త్రిగారి జీవితములో