మాడపాటి హనుమంతరావు
1885
బ్రాహ్మణులు. తల్లి: సుబ్బమ్మ. తండ్రి: వేంకటప్పయ్య. జన్మస్థానము: కృష్ణాజిల్లా, నందిగామ తాలూకాలోని పొక్కునూరు. నివాసము: హైదరాబాదు. జననతిథి: తారణ సంవత్సర మాఖ శుద్ధ షష్ఠి. 1885 జనవరి. రచనలు: ముద్రితములు: 1. మల్లికాగుచ్ఛము 2. మాలతీగుచ్ఛము 3. క్షాత్రకాలపు హింద్వార్యులు 4. తెలంగాణా ఆంధ్రోద్యమము (1 భా) ఆముద్రితములు: 1. గ్యారబాల్ది చరిత్రము 2. మహాభారత సమీక్షణము. 3. తెలంగాణా ఆంధ్రోద్యమము (2వ భాగము) 4. రోమక సామ్రాజ్యచరిత్రము (అసంపూర్ణము)
జన్మదేశము కృష్ణామండలమేకాని, హనుమంతరావుగారు హైదరాబాదు నివాసులు. నిజాము రాజ్యములో రాజకీయ ప్రాముఖ్యము వహించిన తెలుగువారిలో వీరు ప్రథమశ్రేణికి జెందినవారు. ఆయనను రచయితలుగా నెక్కువమంది వినియుండరు. ఏమనగా హనుమంతరావు గారు రచించిన గ్రంథములు పుటల ప్రమాణములో దక్కువ. అవియైనను, సాహిత్యసంబంధము కలవికావు. ఎక్కువ, దేశభక్తి సముత్తేజకములు. చరిత్ర విషయకములును. ఆంధ్రోద్యమము వీరి ప్రాణప్రాణము. తెలంగాణా ఆంధ్రోద్యమము వీరిది ప్రథమ భాగము ముద్రితమైనది. మల్లికా - మాలతీ గుచ్ఛములు రెండు ముద్దయిన గ్రంథములు. అందలికథలు ప్రాచినాంధ్రుల విశిష్టతకు మహాదర్శములు. తెలుగులో గ్రాంధికశైలి వీరిది తీరుగానుండి విందుసేయును. మల్లికా గుచ్ఛమున జారిత్రకములు సాంఘికములు నగుకథలు మధురధోరణిలో నున్నవి. రుద్రమదేవి మున్నుగా నున్న గాథలు వీరి చరిత్ర దృష్టికి మంచి నిదర్శనములు.
హనుమంత రావుగారు బి.ఏ., బి.యల్. పట్టమునందిన న్యాయవాదులు. 19 వత్సరముల యీడునుండి యిరువది యేడేండ్ల యీడు