పుట:AndhraRachaitaluVol1.djvu/486

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెడ్డి పాలెములో మనస్సు హఠాత్పరివర్తనము పొందగా నాశుకవితా సన్న్యాసము చేసిరని సుబ్బారావుగారిని గూర్చి చెప్పుకొందురు. దైవదయ నిండారుటవలన గలిగిన యీ మార్పు సుబ్బారావుగారిచే రసభావ భరితమైన కబ్బములు వ్రాయించినది. రవీంద్రుడు - విధుశేఖర భట్టాచార్యులు - ఆంధ్రరత్న గోపాలకృష్ణడు - సముద్రాల అప్పలాచార్యులు మున్నుగాగల సహృదయుల సాహచర్యము సుబ్బారావుగారి భావమణులకు శాణోపలము. సాహితీ సమితి కార్యదర్శి నోరి నరిసింహ శాస్త్రిగారు వీరిని గుఱించి యిట్లు ముచ్చటించుచున్నారు.

"సుబ్బరాయ కవిశేఖరునకు కవితావతారము, అక్షరరమ్యత అభిమాన పాత్రములైన విశిష్ట విషయములు. వీని నీకవి రమణీయమార్గమున బహుముఖముల ప్రదర్శించుచుండును. కవులు ఉత్తమ విషయములను సందర్భాను సారముగా లోకమునకు ఆస్థ దృడమగుటకు వివిధ వివిధములవర్ణించుట మనపురాణకవుల నాటినుండియు సంప్రదాయ సిద్ధమే. ఈకవి ప్రకృతి శోభను మైత్రిని భక్తిని, జగత్కల్యాణమును కావ్యసందోహములో నిబద్ధముచేసి రమణీయోపదేశవ్యంజనచే ఉత్తమ బోద్ధ అయినాడు."

శ్రీ సుబ్బారావుగారి కబ్బములకు మొదటిదశలో నున్న ప్రజాదరణము నేడు కొంత కొఱవడినది. అనగా, తెలుగు చదువురులలోని భావుకత సన్నగిల్లుచున్నదనియే విచారింపు డని యొక పెద్దమానిసి సమాధానము. ఆధ్యాత్మిక శక్తి సంవలితమైన యీయన యగాధభావన, అక్షరరూపము తాల్చునపుడు మిక్కిలి చిక్కగా బిగువుగా నుండును. అది పాఠకసాధారణ్యమున కందదు. అదిగాక యన్వయములో గొంతతిరుగుడు. దాన, దీన - సుఖవంతుడైన చదువరి రాయప్రోలు వారి రచనలు నేడు పాడుకొనుట తగ్గించినాడు. ఈనాటి పాఠకునకు ఆపాతరుచికరమైన శైలి కావలయు నట! దానిలో, పిండి యున్నను లేకున్నను వాని కిబ్బందిలేదు!