తనగీతి యఱవ జాతిని పాటకులను గా
దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి
తనపోటులు విరోధి తండంబులకు సహిం
పనివిగా మెరసిన తెనుగు కత్తి
తనయందములు ప్రాంతజనుల కభిరుచి వా
సన నేర్ప నలరిన తెనుగు రేఖ
తన వేణికలు వసుంధరను సస్యశ్యామ
లను జేయ జెలగిన తెనుగు భూమి
అస్మదార్ద్ర మనోవీధి నావహింప
జ్ఞప్తి కెలయించుచున్నాడ; చావలేదు,
చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర!
హృదయములు చీల్చి చదువుడో సదయులార!
రాయప్రోలు కవిగారి యీప్రబోధము ప్రజలనే కాక, యువకవులను సైతము తొలి దినములలో లేపినది. పయిపద్యములు జీవన్మూర్తులై నేడు తెలుగునాడన సంచరించుచున్నవి. సుబ్బారావుగారి రచనలు రెండుగా వేఱువఱచుకొన్నచో నొకటి జాతీయ రచనల సంపుటము, రెండు ప్రేమకావ్యసంపుటము కాగలదు. వీరి ప్రేమ తత్త్వ సద్ధాంతములు పవిత్రములయినవి. ఆధ్యాత్మిక తత్త్వ జిజ్ఞాస రాయప్రోలు కవీంద్రునిలో నుండవలసినంతగా నున్నది. "సచ్చి దానంద కల్యాణ సదన మయిన, యీ మనోహర జగతికి నేగుదెంచి ప్రేమలక్ష్మి నారాధింపవేమి యకట!" యిది వీరి యభిప్రాయము. కావ్యములలో సుబ్బారావుగారు ప్రదర్శించిన ప్రేమ లౌకిక సాధారణమైనదికాదు.
నడచి బడలిన యాయాన మెడలలేదు,
చీర చెఱగుల తడి యైన నాఱలేదు,