నమునకు బంట అసలు, పసినాటినుండి రావుగారికి భాషా - సారస్వత చరిత్రపరిశోధకతలో మంచియాస్థ. బోధనచాతుర్యము వీరిది గొప్పది. విశాఖమండలములోని 'అరసవిల్లి'లో రెండుపాఠశాలలు నారాయణరావుగారు నెలకొల్పిరనగా, ఆయన సేవాపరాయణత యెట్టిదో భావింపుడు. ఆపాఠశాలలో నొకటి రైతుపిల్లలకు, రెండవది హరిజనులకు నుపయోగించునవి. వ్యవసాయము మీద రావుగారి కెంతో మక్కువ. గంజాం జిల్లాలో జరిగిన నూతన వ్యవసాయ పరిశోధనపు బోటీలో వీరికి బంగారు పతకము బహూకృతి లభించినది. ఉత్తరసర్కారు జిల్లాలో ఇంగ్లీషు బోధనశక్తి ప్రచారము చేయుటకుగా "ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్సు" ఉద్యోగము రావుగారి కీయబడినది. ఈ యవకాశములో వీరు జర్మను - అమెరికా సంయుక్తరాష్ట్ర విద్యావిధానములను గూర్చి తెలుగున బ్రచారముగావించిరి. తరువాత, అనంతపురము కళాశాలలో నాచార్యకము. సుగృహీతనామధేయులగు నెందఱో శిష్యులు రావుగారి పేరు చెప్పుకొనుచున్నారు. ఈయదృష్టము వారిది మెచ్చదగినది. మదరాసు, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయములలో నెన్నో సంఘములకు వీరు సభ్యులుగా నుండి గౌరవముల నందిరి. రాజమహేంద్రవరము నందలి 'ఆంధ్రేతిహాస పరిశోధకమండలి' కి బెక్కుకాలము అధ్యక్షులుగా నుండి నారాయణరావుగారు చేసిన పరిశోధన కృషి యమోఘమైనది. ఆ మండలికి తాళపత్త్రగ్రంథములు, కొన్ని వందలు వీరు దారవోసిరి. చాల కాలమునుండి సేకరించిన శిలా - తామ్ర శాసనములు, నాణెములు మండలికే యిచ్చివైచిరి. ఈ యౌదార్యము చారిత్రకులకు శిరోధార్యమైనది. రాయలసీమలోని కృష్ణదేవరాయ విద్యాపీఠసంస్థకు స్థాపకత్వము, ఆధ్యక్ష్యము నారాయణరావుగారిది. ఇట్టి భాషా లోకోపకారకములగు కార్యముల వలన జిలుకూరి వంశ తిలకుడు మాయని యశస్సు సంపాదించెను.
పుట:AndhraRachaitaluVol1.djvu/473
Appearance