Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          ఛన్నత వారలుపోయిన
          తెన్నున మెఱుఁగులను దీర్చి దిద్దుచుఁ బోదున్.


నన్నయ తిక్కనల యొరవడి సత్యనారాయణగారి కవితకు శయ్యాసౌభాగ్యములోనా ? భావనావైభవములోనా ? యని మనసంశయము. అక్కడక్కడ నన్నయ్య తిక్కనల నడకతో నున్నకొన్ని పద్యములున్నవికాక ! మొత్తముమీఁద సత్యనారాయణగారి కవితాశయ్యకు రామకృష్ణుఁడు - కృష్ణరాయలు - శ్రీనాధుఁడు - నాచన సోమనాధుఁడు వీరే యాదర్శ కవులుగాఁ దోఁచెదరు. ఇఁక, భావనా వైభవములో వీరి దొక ప్రత్యేకత. "దీపితాలాతమువొలె నామది విలంబన మోర్వదు నిత్యవేగి నాచేతము శబ్దమేరుటకుఁ జిన్నము నిల్వదు భావ తీవ్రతన్" అని రామాయణ పీఠికలో. ఇంత భావతీవ్రతగల కవి శబ్దము లేరుకొని శైలియే పరమార్ధ మనుకొన లేఁడు. అది యటుండె,


శ్రీ సత్యనారాయణగారి కవితా గురువులు చెళ్ళపిళ్ళవారు. వేంకట శాస్త్రిగారిని గూర్చిన యీకవి హృదయము మహోదారమైనది.


          తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
          త్తన తన శిష్యులన్న నెడఁదం గల ప్రేముడి చెప్పలేని మె
          త్తన యయి శత్రు పర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
          కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్.


          అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
          డలఘుస్వాదు రసావతార ధిషణా హంకార సంభార దో
          హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డయినా డన్నట్టి దావ్యోమపే
          శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్.


ఈ రెండవపద్యములో సత్యనారాయణగారి కవితాహంకారము రూపము కట్టియున్నది. ఈ అహంకారము వాస్తవమైనదే కాని, యుండరానిది