పుట:AndhraRachaitaluVol1.djvu/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూత్రవిచ్ఛిత్తి సేసికోకుండఁ జూచుకొనుచు నిట్టి మహత్తరగ్రంథము సంధానించుట బహుకష్టమైన కృషి. ఈ కృషిలో వీరి ప్రాపంచిక విజ్ఞానము పంట పండినది. సత్యనారాయణగారి వచన రచనలో నొక క్రొత్తదనము, చిక్కఁదనము గోచరించును. తిక్కన పద్యరచనలో వలె వీరి రచనలోఁ గ్రియాపద బాహుళ్యము ఎక్కడికక్కడ భావము తెగిపోయి పాఠకునిలో మెల్ల మెల్లగాఁ జొచ్చుకొనును. ఈయన భావన యగాధమైనది, దానిని భాషలోఁ బెట్టునపుడు కొంత క్లిష్టత యనివార్యము. 'పాషాణపాకప్రభువు' అను ఖ్యాతి సత్యనారాయణగారికి వచ్చుటలో నర్థ మున్నది. ఆయన శిరీషకుసుమ పేశలముగా వ్రాసికొని పోవుచుఁ, బట్టరాని భావనాపథమునఁ బడినపుడు బ్రహ్మాండమువంటి సమాసము లుపయోగించిరి. ఆ యుపయోగము ప్రయత్నించి తెచ్చుకొన్నది కాదు. ఆయన కది యాజానజము. పద్య-గద్య రచనలు రెండింటను వీ రీయాచారముతో సాగుదురు. గమనింపవలసిన దేమనఁగా, పాఠకుని నిలఁబడనీయకుండ లాగుకొనిపోవు శక్తి వారి వచనములోఁ బ్రచురముగా జాలువారు చుండు ననుట. ఈ ధోరణిలో 'వేయి పడగలు' గాక మఱి తొమ్మిది పది నవలలు వీరు రచించిరి. 'చెలియలి కట్ట' సాంఘికము. 'ఏకవీర' పై నవలల యెదుటఁ బసిబిడ్డయే, కాని విశ్వనాధవారి 'నవలా' సంతానములో నిది మెఱికవంటి రచన. చరిత్రాత్మకమైన యీకూర్పులో అప్రసిద్ధములై యణఁగియున్న దేశమర్యాదలు పెక్కు పేర్కొనఁబడినవి. ఆంధ్రుల పరిపాలనము, వారి ప్రతిభ యిందు రమణీయ దృశ్యముగాఁ గనఁబడును. కథాసంవిధానము, పాత్రపోషణము గొప్పవి. 'ఏకవీర' లో సందర్భోచితముగా వర్ణితమైన కూచిపూఁడి భాగవతుల భామ కలాపము, గొల్ల కలాపము సత్యనారాయణగారి ప్రాచీన కళాభిజ్ఞతకు గుఱుతులు. 'ఏకవీర' యే విశ్వనాధవారికి 'నవలా'కారులలో కురిచీ వేయించి కూర్చుండఁ బెట్టినది. తరువాత వేయి పడగలతోఁ