పుట:AndhraRachaitaluVol1.djvu/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవయవములే పరాధీన మయ్యెనాకు
నింక నాస్థితి నీవ యూహించు కొనుము
యీవు మాత్రము వేరె యూహింపనేల
పడతి ! నాయట్లె స్వానుభవంబు గాదె !


ఈపద్యము ' చాటుపద్యములు ' అనుచిన్న పొత్తమునందలిది. పై యౌవననిగర్హణము, ఈ చాటుపద్యములు అను రెండుకృతులే కాక ' శృంగారతిలకము ' అను కృతితో మొత్తము మూడు శృంగారగ్రంథములు కోటగిరి వేంకట కృష్ణారావుగారు రచించిరి. ఈమూడును వీరి తొలికృతులు. ఇవి చదివినవారికి కృష్ణారావుగారు శ్రీనాథుని వంటి వాడని యనిపించును. చాటుపద్యములను బట్టి స్వభావమును లెక్కించుట కొందరి యభిప్రాయము. క్రీడాభిరామమును బట్టి శ్రీనాథుడు పచ్చిశృంగారి యని మనము నిశ్చయించివైచుటకు వీలుపడదు.


శృంగార - వీరములే కవి కుపాస్యములైన రసములు. మన కోటగిరి శృంగారరస మెంతసొగసుగా గవితలో జాలువారించెనో, వీరరస మంతకు మిగులగా బ్రదర్శించెను. పాదుషాపరాభవము, బెబ్బులి యను వీరి నాటకములు చూచినవారి కీ రహస్యము తేలిపోవును. ఈ కవి సామాన్యుడు కాడు. గంపలగూడెము జమీందారయి బహుమహాకవులను గౌరవించుచున్న కవి. నాటకాంతకవిత్వము వ్రాసిన మహాకవి. ఈయన కవిత కింత బిగువులగువులు వచ్చుటకు బురాజన్మ సుకృతమే హేతువు. ఏ మహావిద్వాంసుడు వాడలేని యటులు మంచి పొంకముగా బింకముగా బదసంధానము గావించును. సమాస భూయస్త్వము వీరికవితకు దరచుగా నుండు గుణము. ఆ గుణము వీరరస భరితమైన వీరి నాటకములు కొన్నింటికి గొప్ప రమణీయత నిచ్చినది. ' శ్రీకృష్ణరాయనాటకావళి ' యనుపేర వీరు రచించి ప్రకటించిన నాలుగు నాటకములు చాలగొప్పవి. వీనికి శ్రీ విశ్వనాథ