పుట:AndhraRachaitaluVol1.djvu/402

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చ. నలువురనోళ్ళలో బడుట నచ్చదువో మనరామమూర్తి కి

య్యలఘుని యుత్సవంబునకునై తలపెట్టితి రుత్సవంబు మీ

రలు మహనీయ లీతడు భరంబని మీసభ కేగుదేర సి

గ్గిలి యెట డాగునో, తెలిసి కేల్గన పట్టుక నిల్పు డెట్టులో.


ఉ. ఈయన నూత్న నాగరక తేచ్ఛకు లోగెడివాడె యైనచో

బాయని కీర్తితోడ నిరపాయపు రాబడి పోల్వరంపు జూ

చాయల వేలు లక్షలును సాగుచు మ్రొక్కుచు దాండవించు, నే

మాయయు మర్మమున్ సలుపు మాటలతో బనిలేదు లేశమున్.


గీ. ఈతనికి నాకు వియ్యంబు నెనయుకోర్కి

గలిగియుండెను లే వయ:కాలమందు

కైతలో సప్డు ఘటియించె గడమలోటు

మనుమరాలు శ్రీమతి ద్వారమున ఘటించె.


ఇన్ని పద్యము లిటులు చెళ్ళపిళ్ళ కవివి యుదాహరించుట యెందుల కనగా, వీరిర్వుర హృదయ బంధుత లిట్టి వని చదువరులకు దెలుపుటకే. వాస్తవమున కొకమహాకవిచే మెచ్చబడుటయే ఘనతకు గారణముకాదు. అసలు, రసికమానసములూ పగల శక్తి యేదేని రచయితలో నండవలయును. అదికొంత రామమూర్తిశాస్త్రిగారి స్వప్నానసూయలో గనబడుచున్నది. ప్రధానమైన వైద్య వృత్తిలోనే యుండిపోయి, యధాలాభముగా గవిత వ్రాయుచుండుట జరుగుటచే గాబోలు, వీరిపద్యములు తెనుగునాట హెచ్చుగా నల్లుకొనలేదు. ఈసంగతి వారుకూడ గుర్తింపలేకపోలేదు.


నా పాండిత్యము నాకవిత్వరచనా నైపుణ్యముం గాంచి మీ

రీపాటన్నను సత్కరింపరనియే యేనెంతు ; నొక్కింత యే

దో పేరున్నది నాకుదేశమున నాయుర్వేదమం, దద్దియున్

మాపిత్రార్జితవృత్తియం చెఱిగి సంభావింపుడీ సోదరుల్!

                     ________________