పుట:AndhraRachaitaluVol1.djvu/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలువ యిడి నేర్చి యీ నీ

తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెద వాంధ్రా !


శివరామ కవిగారు 'పురాణ మిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవ మిత్యవద్యమ్‌' అను సిధాంతము కలవారు. వేదఋక్కుల నుండి, యుపనిషత్తులనుండి వాక్యము లెత్తిచూపి, నేటి 'భావకవిత్వ' మనబడు నుత్తమజాతి కవితతో వాణికి సామరస్యము చూపుదురు. ప్రాచీనాలంకారికులు పేర్కొనిన భావధ్వని - రసధ్వని యను వానికి నేటి భావకవితకు సాజాత్యము సప్రమాణముగ జూపి, యట్టి కవిత యిప్పటి వారిలో దక్కువమంది కలవడినదని వీ రందురు. ఆంధ్ర భాషలో నేడు పొడముచున్న విప్లవము లన్నియు శివరామశాస్త్రి గారికి గ్రొత్త లనిపించవు. వీరి మనస్సులో నాంధ్ర కవిత్వముపై నెన్నో తడవలు విప్లవభావములు పుట్టినవి. అవి కార్యరూపమును గూడదాల్చినవి. యతి ప్రాస బంధములతో కవిత్వము వ్రాయుటయే గాక, ప్రాచీన ధోరణితో అష్టాదశ వర్ణనములతో బ్రబంధము వ్రాయుటయు నీయన మనస్సునకు నచ్చినది కాదు. "ముక్తాలత" కల్పిత కావ్యము 1910 లో రచించెను. "అందు వచ్చు పాత్రలు ముగ్గురు. శమజయంతు లిరువురు సహాధ్యాయులు, చెలికాండ్రు. వారిలో శముడను వానిని 'ముక్తాలత' యను వారకామిని కామించెను. అదియెఱిగి ముక్తాలతపై మనసుంచుకొని జయంతుడు శమునిజంపెను. మనమెందులకని ముక్తాలత మడిసెను. దానితొ జయంతుడును బ్రాణములు విడిచెను." ఈ కల్పనము మన పూర్వ కావ్యసంప్రాదాయమునకు విరుద్ధము. 'మాధవవర్మ' యను నాటకమును వీరు విషాదాంతముగా రచించిరి. ఈరకముగ బాశ్చాత్య సంప్రదాయములు మన తెలుగులో నెన్నియో జొనిపి 'శివరామశాస్త్రి కూడ విప్లవకారు' డన్న పేరు కొన్నారు. శాస్త్రిగారికి గల యీ సంస్కృతిభావములకు