Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తము గురుముఖమున నేర్చికొని, రాగధోరణిని పద్యములు చదువుచు మధువు లొలికించిరి. నేడును శివరామశాస్త్రిగారు సూరవరపు దోటలో నిల్లు కట్టుకొని యున్నారు. అపుడపుడు పత్త్రికలలో బద్యములు, కథలు, సాహిత్య విమర్శములు వెలువరించుచున్నారు. నడుమ నడుమ సభలలో బాల్గొని, తీయని గొంతెత్తి విసరుచున్నారు. కాని, మానసికముగాను, కాయికముగాను పూర్వోత్సాహము, పూర్వదార్డ్యము తఱగి "తేహినో దివసా గతా:" అనుకొనుచు గాలక్షేపము చేయుచున్నారు. శాస్త్రిగారి జననము 1892 లో. అనగా నీరచన నాటికి వారి కేబది యేడవయేడు సాగుచున్నది. 1926 వ. సంవత్సరము శాస్త్రిగారి జీవికలో నొక పెద్ద మార్పు తెచ్చినది. ముప్పది నాల్గేండ్ల వయస్సు దాటిన తరువాత నున్న శివరామశాస్త్రిగారు వేఱు. దానికి గారణము క్రమముగా ముందు దెలిసికొందము.


శివరామశాస్త్రిగారు కలిగిన కుటంబములోని వారు. వీరి పూర్వులెల్ల మంచి శిష్టులు. వీరి తండ్రిగారు వేంకటేశ్వరావధానులుగారు. తగిన గురువులతో గావ్యనాటకాదులు పఠించి, సిద్ధాంత కౌముది నధ్యయనించి శ్రీ జయంతి భగీరథ శాస్త్రిగారి సన్నిధిని 'వ్యాకరణ మహాభాష్యము' పాఠము చేసికొనిరి. ఈలోపుననే తర్క వేదాంత గ్రంథములు కొన్ని సందర్భము ననుసరించి యాయా పండితులకడ జదివిరి. శ్రీ భగీరథశాస్త్రిగారి గురుత్వమే శివరామ కవికి బేర్కొనదగినదైనది. భార్యతో గాపుర ముండి 'యింజరము' లో భగీరథ పండితునికడ మహాభాష్యము చదువుకొనుట, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి గురుత్వమున సాహిత్యపు బొలుపులు, శతావధానపు మెలకువలు తెలిసికొనుట, శివరామశాస్త్రిగారి విద్యార్థి దశలలోని విశేషములు. పేరునకు విద్యార్థి యన్నమాట గాని, యప్పటి కప్పుడే శివరామశాస్త్రి మంచిపండితుడై, మంచి కవియై చాలగ్రంథములు