తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య
1872 - 1921
తల్లి: శ్రీరంగమ్మ. తండ్రి: రంగమన్నారయ్య. నివాసము: చెన్నపురి. జననము: 1872. అంగీరస నామవత్సరము. అస్తమయము: 1921. రచనలు: 1. భగవద్గీత వ్యాఖ్య 2. వచన భాగవతము. 3. వచన రామాయణము 4. వచన భారతము 5. నన్నెచోడుడు (జీవిత విషయము) 6. సర్వదర్శన సంగ్రహము 7. కర్ణచరిత్రము (ఆముద్రి) 8. మను వసు చరిత్రాదులకు వ్యాఖ్యానములు, పీఠికలు ఇత్యాదికము.
తేవప్పెరుమాళ్ళయ్యగారికి దేవరాజసుధి యని పండితుల వ్యవహారము. ప్రధానముగా నీసుధీమణి పీఠికాకారుడుగాను, వచన రచనా విశారదుడుగాను బేరందెను. మదరాసులో నానందముద్రాలయమువారి యాదరణమున నీయన మృదువగు వచనములో భారత భాగవత రామాయణములు రచించెను. మను, వసు చరిత్రాది పూర్వకావ్యములకు వ్యాఖ్యలు గావించెను. నన్నె చోడుడు మున్నగు కవుల కాల నిర్ణయమును గూర్చిన వ్యాసములు "ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక" "భారతి" మొదలగువానిలో వెలువరించెను. రెండు భాషలయందును జక్కని చిక్కని చాటుకవిత కొంత సంతరించెను. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యస్థానమున బండితుడై పదార్థవిచారము చేసెను. మొత్తము నలువదితొమ్మిదేండ్లు మాత్రము జీవించెను. సుకృతీగతాయుః.
ఈ దేవరాజసుధి పూర్వులు తంజనగరరాజాస్థానమున సంగీత విద్వాంసులుగ నుండిరి. వీరితాతగారు తేవప్పెరుమాళ్ళయ్య యన బడు వారు. ఆయన మంచి పాండితి గలిగి, వాగ్ధాటియుండి భక్తియోగమును