పుట:AndhraRachaitaluVol1.djvu/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాఖాధికారులు యోగ్యతాపత్ర మొసగిరన్న సంగతి తెలుగువారింకను మఱచియుండరు. మన నరసింహము పంతులుగారి ప్రధానోపాధ్యాయత్వమే యీ పాఠశాల కీ గౌరవము దెచ్చినది. పంతులుగారు పనిచేయుచున్నపుడు మెట్రిక్యులేషన్‌లో నూటికి నరువదిడెబ్బదివఱకు నుత్తీర్ణులసంఖ్య పెరిగినది. పంతులుగారు విద్యార్థులను బై తరగతిలోనికి బంపుట కెంతకార్కశ్యము కనబఱిచెడివారో, దానికి బదిరెట్లుత్తీర్ణులను జేయుటలో గారుణ్యము కనబఱచెడివారు. వీరికి శిష్యులయందెట్టి యాదరమో, వీరిపై వీరి శిష్యుల కట్టి భక్తి గౌరవములు. వీరి శిష్యులు నేడు మహాపదవులలో నుండి గౌరవింపబడుచున్నారు.

1938 లో నొకమారు పంతులుగారికి గొప్ప జబ్బుచేసినది. అది తెలిసికొని కాకినాడనుండి ముగ్గురు శిష్యులు రాత్రికి రాత్రి బయలుదేఱి వచ్చి వీరి చేతిలో నూఱురూపాయలు పెట్టి 'తమ రివి స్వీకరింపక తప్పదు. మాప్రార్థనము విని నిఘంటుకార్యాలయములో నింక బనిచేయవలదు. నిరంతర భాషావ్యాసంగమే మీయనారోగ్యమునకు హేతువు' అనిచెప్పి వెళ్ళిపోయిరట. శిష్యప్రేమ యిట్టిదని పంతులుగారు మాటలవరుసలో నీవిషయము చెప్పిరి.

ఎలమంచిలి, నూజివీడు, నరసాపురము పాఠశాలలలో బ్రధానోపాధ్యాయులుగా నుండి పిఠాపురాంగ్లపాఠశాలకు వచ్చి యచట బెక్కువత్సరములు పనిచేసిరి. 1920 లో శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితులుగా బ్రవేశించిరి. వార్థకదశచే నదియు నిర్వహింపలేక 1938 లో మానివైచిరి. నిఘంటు కార్యాలయమున వీరుచేసినకృషి యమూల్యమైనది.

పీఠికాపురాధీశ్వరులు గంగాధర రామారావుగారు పంతులుగారి చదువు చెప్పించి వీరి యభ్యుదయమునకు సర్వధా తోడ్పడిరి. 1888 లో