పుట:AndhraRachaitaluVol1.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బి.ఎ. ప్రథమశ్రేణి నుత్తీర్ణులైరి. నరసింహము పంతులుగారి వంటి శ్రీరామభక్తుని మఱియొకని మనము చూడము. ఆయన గ్రంథములన్నియు రామాంకితములే చేసెను. పంతులుగారి యభిమానవిషయము వేదాంతము. కళాశాలలో వీరి గురువులు కందుకూరి వీరేశలింగముగారు, మెట్కాఫ్‌ దొరగారు. విలియమ్స్‌పిళ్ల మున్నగువారు. కవితాగురువులు వీరేశలింగ కవిగారేయట. ఈ సంగతి పంతులుగారు తమ 'రామకృష్ణ పరమహంస చరిత్రము' న నిటులు చెప్పినారు.


అందఱును నన్ను నరసింహ మండ్రు; కవిత
యందు నాసక్తి బుట్టించినట్టి గురుడు
కందుకూరి వీరేశలింగ కవిమౌళి
స్థితిగతులు నీకు విన్నవించితిని రామ!


వీరేశలింగము పంతులుగా రొకనాడు బడిలో 'ఆటవెలది" లక్షణము విద్యార్థులకు చెప్పి నల్లబల్లమీద నీరెండుచరణములును వ్రాసి యెవరైన నిది పూరింపగలిగిన బూరింపు డనిరట.


ఆటవెలది మీర లారసి చేయుడి
చేయకున్న మీకు సిగ్గుపాటు


దీనిని మన పంతులుగా రిటులు పూర్తిచేసిరి.

సిగ్గు లెన్ని యున్న జెదరిపోవునుగద
ఆటవెలది పొంత నార్యులార!

చూచితిరా, పూరణములోని చాతుర్యము! పువ్వుపుట్టినతోడనే దాని పరిమళమునుబట్టి యిది యీజాతిపు వ్వని కనిపెట్టవచ్చును.

పీఠికాపుర సంస్థానాశ్రయణము పంతులుగారికి గవులలో బెద్దపేరు తెచ్చినది. వీరువ్రాసిన గ్రంథములు చాల బాఠ్యములుగా నిర్ణయింపబడినవి. 1904 లో శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్రము పద్యకావ్య