పుట:AndhraRachaitaluVol1.djvu/204

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1930 సం. సెప్టెంబరు నెలలో కాశీభట్ట లింగమూర్తి యను నాయన రాజమహేంద్రవరమున మరణించెను. హిందూపత్రికాలేఖకుడు పొరపాటున బ్రహ్మయ్యశాస్త్రిగారు చనిపోయినట్లు "హిందూపత్రిక" కు లేఖ వ్రాసిపంపెను. "హిందూ" పత్రికను జూచి "ఆంధ్రపత్రిక" యు నావార్త వెలువరించినది. దానినిబట్టి నాలుగైదునాళ్లలో నీ కానివార్త నలుమూలల వ్యాపించినది. సంపాదకీయవ్యాసములు, సానుభూతిసభలు, సాంత్వనలేఖలు బయలు దేరినవి. బ్రహ్మయ్యశాస్త్రిగారు హాయిగా గాకినాడలో గ్రంథరచనము చేసుకొనుచునేయున్నారు. ఈక్షేమము మరల ఆంధ్రపత్రికకు బంపపడినది. పత్రికాసంపాదకులు తా మసత్యవార్తను విశ్వసించి యటులు వ్రాసినందులకు వగచుచు బ్రహ్మయ్యశాస్త్రులుగారు పూర్ణారోగ్యవంతులుగా నుండుటకు బద మానందము ప్రకటించిరి. ఈ చమత్కారవిషయమును శాస్త్రిగారు "నా విబుధలోక సందర్శన" మనుకావ్యమున వ్రాసి తమ మధురకవితాధారను తెలుగువారికి జూఱలిచ్చిరి.


తునిసంస్థానాధీశ్వరు లీవిమర్శ కాగ్రేసరునిచే రెండువత్సరము లుద్యోగమునకు సెలవుపెట్టించి "పెద్దాపుర సంస్థానచరిత్ర" వ్రాయించిరి. వీరిచారిత్రకపరిశోధన కది యాదర్శము. మాధవవిద్యారణ్యులు, శిష్టు కృష్ణమూర్తికవి, నారాయణభట్టు, నాచన సోముడు మున్నగువారి ప్రత్యేక జీవితములు వ్రాసిన చరిత్రజ్ఞ డీయన. వీరి వక్తృత్వ మనన్యసామాన్యము. ఉపన్యాసము నడుమ నెవరైన బ్రతిపక్షులు వికట ప్రశ్నలు వేయగా వీరు సద్యస్స్పురణము కలిగి చక్కని సమాధానము చెప్పి మఱి మాటాడ నిచ్చెడివారుకారు. మాట మథురము. భావము తీవ్రము. దీనికి బ్రహ్మయ్యశాస్త్రిగారు పెట్టినదిపేరు.


ఇట్టి మహితాశయునియెడ విమర్శకాగ్రేసరుడని, మహోపాధ్యాయుడని, ఉపన్యాస పంచాననుడని, ఆర్య మతోద్ధారకు డని బిరుదము లన్వర్దములు కాకుండు టెట్లు ?

               ________