పుట:AndhraRachaitaluVol1.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతనే వ్రాయబడిన "త్రిపురాసురవిజయ వ్యాయోగము" వీరేశలింగము పంతులుగారి "శాకుంతలము" మున్నగునవి ప్రదర్శింపబడెనట. భగవద్భక్తినిగూర్చి ప్రజాసామాన్యమునకు బ్రబోధము చేయదలచి 1880 లో "భక్త సమాజము" పేరితో నొకసంస్థ నెలకొల్పి, దాని పక్షమున బ్రతిగ్రామమునకు బర్యటనము గావించుచు నుపన్యాసము లిచ్చుచుండెడివా రట. 1883 "ఆర్యమత బోధిని" యను మఱొక సమాజము నిలిపి "వివేకానంద పుస్తక భాండాగారము" వెలయ జేసిరి. ఈరీతిగా హిందూమత ప్రచారమునకు యావచ్ఛక్తి వినియోగించి సత్ప్రచారము చేసిన సత్పురుషుడీయన. "ఆర్యమతబోధిని" మాసపత్రిక 1905 లో వీరి సంపాదకత్వమున వెలువడుట మొదలయినది. ఈపత్రిక వలన బ్రహ్మయ్యశాస్త్రిగారి పేరు నలుమూలల వ్యాపించినది. సంఘసంస్కర్తల యుద్దేశములు సన్నగిల్లజొచ్చినవి. వీరేశలింగముగారి సంఘసంస్కరణ మహోద్యమమునకు వ్యాప్తి తగ్గినది. ఆసమయముననే పంతులుగారు "సత్యవాదిని" యనుపత్రికను స్థాపించుచు నిట్లు వ్రాసినారు. "వెయ్యగా వెయ్యగా వెఱ్ఱివాడే గెలిచె నన్న ట్లీయనవ్రాతలు జనుల భ్రమపెట్టి నేను పూనినమహాకార్యమునకు గూడ విఘాతము కలిగించు చున్నందున...."


ఆనాడు "ఆర్యమతబోధిని" చదువని యాంధ్రు డుండియుండడు. ఆ పత్రిక యావిధముగా బదునై దేండ్లు నడచి యమూల్యముగ సంఘసేవ యొనరించినది. హిందూమతమును గూర్చి యెవరు నిరసన వ్యాసము వ్రాసినను బ్రహ్మయ్య శాస్త్రిగారే ప్రత్యుత్తరము విమర్శకులు నిరుత్తరులగునట్లు వ్రాసెడివారు. శ్రీ శాస్త్రిగారు మతమునేకాక సారస్వతమును గూడ నడుము కట్టి సేవించిరి.


మంత్రిభాస్కురుని గూర్చి "కవులచరిత్ర" లో వ్రాసిన విషయములు సరిగా లేవని "భాస్కరోదంతము" ప్రత్యేకముగావ్రాసి వెలువరించిరి. వీరు రచించిన "నన్నయ్యభట్టారక చరిత్రము" లో ననేకసిద్ధాంతములు