పుట:AndhraRachaitaluVol1.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకును పంతులుగారు ఒకయేడు వేసవిసెలవులలో గొండలకు బయలుదేఱి పోయిరి. అక్కడ వీరిని చలిజ్వరము పట్టి పీడించినది. చలిజ్వరమునకు 'క్వినైను' బ్రహ్మాస్త్రము. ఆ మందు సేవించుటచే పంతులుగారికి బధికరము ముదిరినది. నవరభాషను సంపాదింపవలయు నన్న పట్టుదలతో నొక యింద్రియముపని చెడ గొట్టుకొనిన పండితు డీయన ఆభాషలో వ్యాకరణము, నిఘంటువువ్రాసిరి. దానిలోని పాటలు వ్రాసికొనిరట. నవరలకు బడులు పెట్టించిరి. కొంద ఱాంగ్లేయులకు నవరభాష నేర్పించిరి. శబరభాషావాగనుశాసకుడగు రామమూర్తిగారు మనకు జిరస్మరణీయుడు. 1913 లో వీరిని ప్రభుత్వమువారు రావుసాహేబు అని సన్మానించిరి. వీరు భాషా సంస్కారవాదులే కాక వితంతూద్వాహము, హరిజనోద్ధరణము కోరిన సంఘసంస్కార ప్రియులు కూడను. కన్నేపల్లి వేంకటనరసింహముపంతులుగా రనబడు వీరి శిష్యులొకరు ఇంగ్లండులో 'బారిష్టరు' చదువు చదువుకొని వచ్చిరి. వారిని పిలిచి రామమూర్తి గారు తమయింట విందుచేసిరి. అది సనాతను లిష్టపడక విరిని నాడు వెలివెట్టిరి. వజ్రచిత్తున కిటువంటి వెలియొకలెక్కా! పర్లాకిమిడి ఒరిస్సారాష్ట్రములో నన్యాయముగ గలిపివేయుటను సహింపలేక, రాజాగ్రహమును దిగదుడిచి రాజమహేంద్రవరము వచ్చి కూర్చుండిన యేకైకవీరుడు రామమూర్తి పంతులుగారు. "భారతీశతకము", మఱికొన్ని గ్రంథ పీఠికలు, బహువ్యాసములు వ్రాసి పేరువడయు లక్ష్మీసీతాపతి రావుగారు రామమూర్తి పంతులుగారి సత్సంతతి.


                           __________