వఱకు బంతులుగారు పర్లాకిమిడి రాజావారి కళాశాలలో రాజకీయార్థికచరిత్రాధ్యాపకులుగ నున్నారు. ప్రత్యేకరాష్ట్ర విభజనవిషయములో బర్లాకిమిడిని ఓడ్రులు పొట్ట బెట్టుకొనుట వీరి కసహ్యమైనది. పర్లాకిమిడి తెలుగునేలలో గలియుదాక దిరిగిరామని ప్రతిజ్ఞచేసి రాజమహేంద్రవరమున బ్రవేశించినారు.
గిడుగు రామమూర్తిపంతులుగారిపేరు స్మరించినతోడనే వ్యావహారిక వాదము స్మరణకు వచ్చును. మొట్టమొదట నీవాదముప్రతిపాదించిన వారు విశాఖపట్టణ నివాసులు పి. టి. శ్రీనివాసయ్యంగారు, గురుజాడ అప్పారావుగారు, గిడుగురామమూర్తిగారును. కన్యాశుల్కము వ్రాసిన గురుజాడ వారి కలము గిడుగువారి నూతనవాదమునకు సహస్రముఖముల సహకారియైనది. విశ్వవిద్యాలయములో వ్యావహారికము ప్రవేశ పెట్టవలె నని రామమూర్తిపంతులుగారు గట్టిపట్టు పట్టిరి. కాని కొంతకాలమువఱకు ప్రయోజనము కలుగలేదు. మొత్తము మీద నిప్పుడు విశ్వమంతయు వ్యాపించిన దనవచ్చును. "గిడుగురామమూర్తినుడువు నిల్వకపోయె, నొగి జయంతి రామమూర్తి గెలిచె" నని యప్పట్ల వడ్డాది సుబ్బారాయుడుగారు తమపక్షమునకు గలిగినవిజయమున కానందించినారు. అప్పుడు వాదమునకుబ్రచారము సన్న గిల్లినను వాదికిమాత్రము నిరుత్సాహము కలుగలేదు. నాటికిని నేటికిని నెంత మార్పువచ్చినదో చూడుడు. పరోక్షమున నెవరెట్లు తిట్టుకొనినను బ్రత్యక్షముగా రామమూర్తిపంతులుగారి వాదమును నిరసించుటకు వీలు కలుగనీయలేదు. ఈసందర్భమున నలగి నలగియున్న గ్రాంథికవ్యావహారిక వివాదముల బేర్కొని సదసన్నిర్ణయ మొనరించుట యప్రస్తుతము. కాని వీరి వాదమెట్లుండునో తెలిసికొనవలయును.
కవిప్రయోగము తప్పు అని మరి వాదించకూడదు. అది దుష్టవాదము. అది వ్యాకరణమునకు విరుద్ధముగానున్న ఆక్షేపించరాదు.