లేక తూచాలు తప్పక పుల్ స్టాపులతో - శకటరేఫములతో - నరసున్నలతో నిప్పటికిని నవనవముగానున్న వారి భారతపువ్రాత ప్రతిని నక్షిపర్వముగా నవలోకించువారిదే యదృష్టము. పదమూడు పర్వములు మాత్రము వ్రాతలోనున్నది. అచ్చుపడినది యాదిపర్వమొక్కటియే. మహాభారతమునుండి నవముగా నీతమైనదనునర్థము వచ్చునట్లును, మహాభారతములోని నవనీత తుల్యమైన సారతరపదార్థ మనునూహ కలుగునట్లును దీనికి 'మహాభారతనవనీత' మనునామకరణము శాస్త్రులుగారు చేసి యుందురు. ఇదిమూలమునకు ముక్కకు ముక్కగా జేసిన యాంధ్రీకృతి గాదు. ఈ వ్యాసభారతమునకు బీఠిక వ్రాయుచు బీఠికాపురసంస్థాన కవులు ఓలేటి వేంకటరామశాస్త్రిగా రిట్టులనిరి.
" శ్రీవ్యాసమూర్తి శాస్త్రులవారు తొలుదొలుత నీభారత రచనమున కారంభించినపుడు నేనును నామేనత్తకుమారుడు రామకృష్ణశాస్త్రియు నస్మద్గురుదేవసమానులు, నత్యంతాప్తబంధువులు నగు శ్రీ శాస్త్రులుగారి యొద్ద మాకు గలిగిన చనవునంజేసి 'ఆర్యా! కవిత్రయాంధ్రీకృతమహాభారతము సర్వాంగసుందరమైవిరాజిల్లుచుండ మరల నీభారతనవనీతరచనకు బూనుకొనుట యెందుల' కని నిర్భయముగా నడిగితిమి, అప్పుడు వారు సెలవిచ్చిన యుపవత్తు లివి: "వ్యాసభట్టారక ప్రోక్తమైన శ్రీ మహాభారతమును నన్నయభట్టారకాదులు నవరసభరితముగ నాంధ్రీకరించిన సంగతి వాస్తవమే. వారి కవితారచనాదులు నిరుపమానములై సర్వజనాహ్లాదకరములై యుండుటయు యథార్థమే. నేనిప్పుడు వారికవనమున లోపములు గలవనుతలంపుతో గాని,వారికవిత్వము నతిశయింప వలయుననుకోరికతో గాని యిందులకు బూనుకొనలేదు. పంచమ వేద క్షీరవారాశినుండి నేనును నాశక్తికొలది కొంత నవనీతము నెత్త దలచితిని. ఆ గభీరవారాశిగర్భమున విలీనములైన నీతిరత్నముల గొన్నిటి నాంధ్రులకు వెల్లడిసేయుట యవసరమనితోచినది. ఇదియును గాక,