లలో బొందిక, నడతలో నార్జనము, జీవికలో నిరాడంబరము వ.సు.రాయకవికి బెద్దమనుష్యులలో బేరుదెచ్చినవి. నచ్చినవారి నదేపనిగా నుతించుట, నచ్చనివారిని బట్టి దూషించుట వారిచేతకాదు. విద్యకు దగినసుగుణసంపద యుండుటచే వసుకవి యనంతకీర్తి నందెను. సుబ్బారాయుడుగారు తమ జీవితసంగ్రహము తెలియుట కీసీసము వ్రాసికొనిరి.
పుట్టుక పొసెర్లపూడిలంకను, దండ్రి
బందుగులింట నానందయందు
మెత్తని పొత్తుల సత్తమిల్లుట, శైశ
వక్రీడ, పదుకొండువత్సరముల
ప్రాయంబుదనుక నొరంగ మౌకోరంగి
గన్నవారల వియోగంబు నటనె
అక్షయ మొదలు పరాన్న మేడేండ్లు దొ
డ్డమ్మపేట దివాణమందు, శ్రీము
ఖాబ్దమున సొంతకాపుర మక్కొటికనె
ప్రథమజాయానియోగహృద్వ్యధయు, భావ
రాణ్మహేంద్రంబునందు నాంధ్రంపుటొజ్జ
పదవి: ననురాయ చరితంబు ప్రథిత మవల.
సుబ్బారాయుడుగారు చిన్ననాట దొడ్డమపేట దివాణమువారి పోషణమున నుండి విధ్యాభ్యాసము చేసిరి. నాడు వీరిగురువులు వాసుదేవశాస్త్రులుగారు దొడ్డమపేటకు సమీపమున గల 'భీమక్రోశపాలెము' లో భాగవతుల హరిశాస్త్రిగారను సుప్రసిద్ధవై యాకరణు లుండెడివారు. వారియొద్ద జదువుకొను విద్యార్థి యొకడు "శ్రీదక్షపురీనివేశ! శ్రీ భీమేశా!" యను సమస్యను మనకవిగారి కీయగా వీరు దానిని పదిరకములుగా బూరించి చూపించిరట. అప్పుడు వీరి గురువులు సంతసించి ముందుముందు నీవు కవిశేఖరుడ వౌదు వని యాశీర్వచించిరట.