పుట:AndhraKavulaCharitamuVol2.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నయ్యెను. గ్రంథసామగ్రి తక్కువగుటచేత నీతనికాలమిదియని నాకిప్పుడు నిశ్చయముగా దెలియక పోయినను, ఇతడు పదునాఱవశతాబ్దమునకు బూర్వుడని తెలియవచ్చుచున్నది. ఈతని కన్యకాపురాణమునుండి రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను:-

ఉ. అంతట నింగితజ్ఞ డగునాకుసుమాఖ్యుడు నాదరంబునన్
గాంతను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీమనంబునన్
జింత వహించి యిట్లునికి చెప్పుము నీకు మనోరథార్థముల్
సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్. [ఆ. 5]

చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవదప్పినన్
బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింపకుండినన్
గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింప కుండినన్
బలికిన బొంకనేరరు కృపానిధులై తగువైశ్యు లెప్పుడున్. [ఆ. 7]

                       ___________

10. బైచరాజు వేంకటనాథకవి

ఇతడు పంచతంత్రమును పద్యకావ్యమునుగా రచియించెను. ఈకవి క్షత్రియుడు. ఈతని తాతయైన బైచరాజునుబట్టి యీకవి కీయింటిపేరు కలిగినట్లు తోచుచున్నది. కవి తనవంశకర్తయైన బైచరాజునిట్లు వర్ణించియున్నాడు:-

ఉ. ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుడు బైచనృపాలు డద్ధరి
త్రీరమణీమనోహరునితీవ్రయశస్సృతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.