పుట:AndhraKavulaCharitamuVol2.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథలు గలవుగాని యవి విశ్వాసార్హములు గావు. అయినను దీనిం జదువు వారికి వినోదకరముగా నుండవచ్చునని యెంచి యందొక పద్యమును దానిమీది యాక్షేపణమును నిందుదాహరించు చున్నాను:-


క. కలనాటిధనము లక్కఱ| గలనాటికి దాచ గమలగర్భునివశమా

నెలనడిమినాటివెన్నెల| యలవడునే గాదెబోయ నమవసనిసికిన్.


అనుపద్యమును పెద్దన రచియింపగా నందలి "యమవసనిసి" యన్నప్రయోగము నవ ప్రయోగమునుగా భావించి రామకృష్ణకవి యపభ్రంశపదములతో గూడిన యీక్రిందిపద్యముచేత నాతని నాక్షేపించి యున్నాడని చెప్పుచున్నారు:-


క. ఎమితిని సెపితివి కపితము

బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో

యుమెతక్కయ దిని సెపితో

యమవసనిసి యన్నమాట యలసని పెదనా.


"అమవసనిసి" యన్నమాట తప్పు కాకపోవుటచేతను, రామకృష్ణకవి యలసానిపెద్దన కాలములో నున్నవాడు కాకపోవుటచేతను, ఈకథ కేవలకల్పితమే కాని యిందు సత్య మెంతమాత్రమును లేదు. కృష్ణదేవరాయల యాస్థానమునకు వచ్చిన విద్వత్కవీశ్వరులను బరీక్షించుటకయి యాంధ్రకవితాపితామహుడె నియమింపబడుచు వచ్చెననియు, అత డావచ్చిన కవీశ్వరులకు నానావిధము లయిన సమస్యలనిచ్చి వారు పూరించిన పద్యపూరణములనుబట్టి వారి సామర్థ్యమునను నిర్ణయించుచు వచ్చెననియు జనశ్రుతి గలదు. ఒకనాడు రాధామాధవు డనుకవి తదాస్థానమునకు వచ్చినప్పుడు పరీక్షార్థముగా పెద్దన్న "నగరు" "తగరు" "తొగరు" "వగరు" అను పదములు ప్రాసస్థానములందుంచి రామాయణ పరముగా బద్యమును గూర్పు మనగా నాకవి యిట్లు చెప్పెనట:-