పుట:AndhraKavulaCharitamuVol2.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పించినను, పూర్వ కవిప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు చేసినను, లింగమగుంట తిమ్మన్న, అప్పకవి, కూచిమంచి తిమ్మన్న మొదలయిన, లక్షణవేత్తలీ వేంకటకవిని లాక్షణికకవినిగా అంగీకరించి తమ లక్షణ గ్రంథములయందీతని గ్రంథములనుండి పద్యముల నుదాహరించియున్నారు. ఇప్పటివారు కవిత్వసారస్యమును విచారింపక గ్రంథములయందు రేఫద్వయప్రాస నిశ్రమమైత్రియో యేదో వ్యాకరణదోషమో యున్నదన్న హేతువుచేతరసవంతములైన యుత్తమ గ్రంథములను సహిత మగ్రాహ్యములని నిరాకరించుచున్నందున, అట్లు చేయుట యుక్తముకాదనియు ఛందోవ్యాకరణ దోషములు లేని రసహీనములగు గ్రంథములకంటె ఛందోవ్యాకరణదోషములను గలవయినను రసవంతములయిన గ్రంథములే యధికాదరణీయము లనియు జూపుటకయి యీ కవివిషయమున నింతదూరము వ్రాసినాడను. కవిత్వమునం దక్కడక్కడ గొన్ని నెరసులున్నను జాతీయములతోను సామెతలతోను నిండియుండి యర్థగౌరవము కలదయి రసవంతమయి యున్నందున చేమకూర వేంకటకవి కవిత్వము సర్వజనాదరణీయమయినదని తలచుచున్నాను. ఈకవి యించుమించుగా పదునేడవ శతాబ్దముయొక్క మధ్యభాగమునందున్నట్లు తెలియవచ్చుచున్నది. కృతిపతియైన రఘునాధ రాజుయొక్క కుమారుడగు విజయరాఘవరాజు 1674 వ సంవత్సరమునందు మధురాపురము రాజధానిగాగల పాండ్యదేశపురాజగు చొక్కలింగనాయకునితో యుద్ధముచేసి నిహితుడయ్యెను. అతనితో గృతిపతివంశ మంతరించినది. దీనినిబట్టి విజయవిలాసమును సారంగధర చరిత్రమును 1630-40 సంవత్సర ప్రాంతములయందు రచియింపబడినట్లు కనబడుచున్నవి. మూడేసి యాశ్వాసములుగా రచియింపబడిన యీ పుస్తకద్వయము నుండియు గొన్ని పద్యముల నుదాహరించుచు నీ కవిచరిత్రము నింతటితో బరిసమాప్తి నొందించుచున్నాను.