పుట:AndhraKavulaCharitamuVol2.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   బిన్న లుండుటచేగాదె పెద్ద లనుచు
   దెలియగలుగుట యార్యులు తెలిసికొనుట.


ఉ. నేరిచి యాడుపుత్రులును నేరక పల్కిననందనుండునున్
   గూరుమితల్లి కొక్కటియగుం దలపోయగ వాగ్వధూటికిన్
   మీరలు నేను నొక్కటియె మీరువచించినకావ్యమండలిం
   జేరి మదీయవాక్యముల జేరకపోవునె యంచు నెంచుచున్.


పై పద్యములలో భద్రాద్రిరాముని బేర్కొని యుండుటవలన గవి గోదావరీమండలములోనివాడని తేటపడుచున్నది. ఈకవి యాఱు వేల నియోగిబ్రాహ్మణుడు; భారద్వాజగోత్రుడు; వేంకటరాజ పౌత్రుడు; బాపనార్యపుత్రుడు. ఇతడు కృతు లందుట మొదలైన వానినిబట్టి చూడగా నిత డున్నతపదమునం దుండినట్లు తోచుచున్నది. ఇతడు గ్రంథాదిని కేవలాంధ్రపద్యము చెప్పక నన్నయాదుల వలె సంస్కృతభాషతో నీక్రిందిపద్యమును వేసియున్నాడు-


చ. శ్రితజనరక్షణాయ సరసీరుహపత్రవిలోచనాయ వి
   శ్రుతశుభకీర్తనాయ రవిసూనుసఖాయ మఖావనాయ సం
   తతసుగుణాకరాయ వసుధాతనయాపరితోషణాయ నే
   వితపవనాత్మజాయ రఘువీరపరాయ నమోనమోనమ:

ఈతనికవిత్వము కవి తాను జెప్పుకొనినట్లు కదళీపాకముతో దేనె లొలుకుముద్దుపలుకులతో వినువారి చెవులకు జవులు గొలుపుచు హృదయంగమముగానున్నది. కవనభంగిని జూపుటకయి చంద్రహాసవిలాసములోని నాలుగుపద్యముల నిం దుదాహరించుచున్నాను-


ఉ. బంగరుమేడలం జలువసందిరులన్ నెలరాతితిన్నెలన్
   రంగగుమేలిమిద్దియల రచ్చలనంతుల నాట్యశాలలన్
   సింగపుమోము లొక్కయెడ జెక్కినచక్కనిగోపురంబులన్
   బొంగుచు నప్పురీవరము పొల్పు వహించు ధరాతలంబునన్. పూర్వభా.