పుట:AndhraKavulaCharitamuVol2.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. నవ్యసుగుణాభిరామ తెనాలిరామ
   పండితాగ్రణిసత్పుత్రు భవ్యమిత్రు
   హరపదాంభోజసౌముఖ్యు నన్న పాఖ్యు
   నన్ను బిలిపించి యాదరోన్నతి వహించి.


చ. పలుకులకల్కి కప్పురపు బల్కులుచల్లినరీతి బండువె
   న్నెలతళుకుల్ విభుండు హవణించినమించున శంబరారి చెం
   గలువలతూపుకోపుల ముఖాముఖి జూపినయేపునం గృతుల్
   పలుకగ నేర్తు పూర్వకవిపద్ధతి రామయయన్న సత్కవీ.


గీ. సరససాహిత్యసౌహిత్యపరత నీవు
   పరిడవించుసుదక్షిణాపరిణయంబు
   కీర్తి విలసిల్ల మాకు నంకితము సేయు
   తేట యగువాగ్విలాసంబు కోటిసేయ.

ఇక దీనినిబట్టి కృతికర్తయొక్క కాలనిర్ణయము చేయవలసి యున్నది. కృతిపతియొక్క కాలము తెలియునేని, కవియొక్క కాలమును దెలియును. కృతినాథుని ప్రభువైన రామరాజుయొక్క వంశము గ్రంథమునం దీవిధమున జెప్పబడినది-


గీ. చంద్రవంశాబ్ధిపూర్ణిమాచంద్రు డారు
   వీటి బుక్కయరామభూవిభునిసుతుడు
   తిమ్మరాజేంద్రు డన్వయదీపకుండు
   కనియె బినకొండభూపాలు ననఘశీలు.


చ. కులనిధి యానృపాలకుడు కోనమదేవి వరించి కాంచె జే
   కొలది నరాతులం దునుముకోనేటితిమ్మనరేంద్రు భూమిభృ
   త్తిలకము జిన్నతిమ్మవిభు ధీరసుధానిధి నప్పరాజు ని
   ర్దళితవిరోధిభూవరకురంగుని రంగనృపావతంసమున్.