పుట:AndhraKavulaCharitamuVol2.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లార్వీటి బుక్కరాజుకొడుకు రామరా జయినట్టును, రామరాజుకొడుకు తిమ్మరాజయినట్టును, తిమ్మరాజుకొడుకు చినకొండరాజయినట్టును, చినకొండరాజుకొడుకు కోనేటి తిమ్మరా జయినట్టును చెప్పబడెను. ఈకోనేటి తిమ్మరాజు కొడుకయిన రామరాజువద్దనే కృతిపతియైన సోమామాత్యుడు మంత్రిగానుండెను. పయినిజెప్పిన వంశావళినిబట్టి విచారింపగా గృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజున కీరామరాజు పెదతండ్రికొడుకునకు మనుమ డయినట్టు స్పష్టమగుచున్నది. అళియ రామరాజు 1564 వ సంవత్సరమువఱకును జీవించి యాకాలమునకే మనుమల నెత్తినవా డగుటచేత నాతని పెదతండ్రికొడుకును నప్పటికే యెదిగినమనుమలు గలవా డయి యుండ వచ్చును. కాబట్టి విమర్శించిచూడగా సుదక్షిణాపరిణయకృతీశ్వరుని ప్రభువు పదిసంవత్సరము లీవలావలగా 1580 వ సంవత్సరప్రాంతములయం దుండెనని తేలుచున్నది. ఇదియే కవికాలము. ఈకవికి గందాళ శ్రీరంగాచార్యులు గురు వయిన ట్లీక్రిందిపద్యమువలన దెలియ వచ్చుచున్నది-


క. కందాళ భావనార్యుల | నందను శ్రీరంగగురుని నతబుధరక్షా
   మందారంబు నుతింతును | మందారమరందబిందుమధురారభటిన్.


సుదక్షిణాపరిణయకవిత్వము సలక్షణమయి కర్ణ రసాయనముగా నున్నది! కవిత్వ మాధుర్యము తేట పడుటకయి కొన్నిపద్యము లిందుదాహరింపబడుచున్నవి-


చ. పలుకగ నేర్చుచిత్రములు పాడగ నేర్చినపుష్పవల్లికల్
   మెలగగ నేర్చురత్నములు మెల్లన నడ్వగ నేర్చుచంచలల్
   నిలుకడ నేర్చువెన్నెలలు నెయ్యముతియ్యము నేర్చుపై డిక్రొం
   దళుకు లనం జెలంగుదురు తామరనేక్షణ లప్పురంబునన్. [ఆ.1]