పుట:AndhraKavulaCharitamuVol2.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. తిమ్మరాజు


ఈకవి రాజవంశజుడు; ఓబలరాజు కొడుకు; అనంతరాజు మనుమడు. మంగళగిరి శ్రీనృసింహస్వామి కంకితము చేసి పరమయోగి విలాస మనెడి యైదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఈపద్యకావ్యము నితడు వెంగళనాథుడుచేసిన ద్విపదకావ్యమును జూచియైనను జేసియుండవచ్చును; లేదా స్వతంత్రముగా నైనను జేసియుండవచ్చును. ఇరువురుకవులును నించుమించుగా సమకాలిను లయినందున, ఎవ్వరే గ్రంథమును ముందుగా జేసిరో నిర్ధారణము చేయుటకు శక్యము కాదు.


శా. శ్రీరంజిల్లగ బానకం బనిశమున్ సేవింపగా దద్గుణం
బారూఢిం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్యల
క్ష్మీరమ్యాకృతి నొప్పుమంగళగిరి శ్రీమన్నృసింహుడు స
త్కారుణ్యామృతవృష్టిచే దనుపు నిత్యంబుం బ్రపన్నావళిన్.


ఇది పరమయోగివిలాసములోని ప్రధమపద్యము. ఈకవిత్వము సర్వవిధములచేతను ద్విపదకావ్యమునకంటె శ్రేష్ఠతరముగా నున్నది. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డై నయళియరామరాజునకు దోడబుట్టిన పడుచైన కోనమాంబకు కుమారు డై నందున, వసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయనికిని మేనల్లుడే. ఆకాలమునం దితడు కృష్ణా మండలములోని కొండవీటిసీమకు పరిపాలకుడుగా నుండెను. కవి తాను రామరాజాదులకు మేనల్లు డయినట్లును, కొండవీటికి ప్రభు వయినట్లును, పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములో జెప్పుకొన్నాడు-


సీ. ఏరాజుముత్తాత భూరిసామ్రాజ్యలక్ష్మీధురీణభుజుండు సిద్ధనృపతి
యేనరాధిపుతాత నానార్థిసంతానసంతానశాఖి యనంతశౌరి