పుట:AndhraKavulaCharitamuVol2.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకప్రబంధము జేయవలసిన యావశ్యకముసహిత ముండదుగాన పాందురంగవిజయమని వేఱొకప్రబంధ మున్న దన్నవార్త కల్లయని నిశ్చయింపవలసి యున్నది. ఇతడు నిరోష్ఠ్యరామాయణము మొద లయిన చిత్రకావ్యములను రచియించెనని యొకప్రవాదము కలదుగాని యదియు నిజమయి యుండదు. ఇతడు వికటకవి యనియు, అనేకుల ననేకవిధముల వంచించె ననియు, పెక్కు కథలు చెప్పుదురుగాని పాండురంగమహాత్మ్యము నంతటి భక్త్యావేశముతో రచియించిన వైష్ణవభక్తాగ్రేసరుడు పామరజనై కాదరణీయములైన తుచ్ఛకార్యములను లోనగునాయని సందేహింపవలసియున్నది. ఈదేశములో పామరజనులు కవులు రసికులని చూపుట కయి వారికి వేశ్యాగమనదోషాదు లారోపించుట చిరకాలమునుండి యాచార మయి యున్నది. ఇతడు వికటకవియని చూపుట కయి యితడు రచియించిన పుస్తక మొక్కటియు లేదు.

"శష్పవిజయంబు చెప్పెద జిత్తగింపు

మేకదంతుండు నీకిచ్చు నింతబొచ్చు."

ఇత్యాదు లగుయతిభ్రంశదోషాదులను గలిగిన పనికిమాలిన బూతుపుస్తకము నొకదాని నెవ్వరో మహాత్ములు "శష్పవిజయ" మనెడి యపాత్రపు పేరితో రచియించి దాని కర్తృత్త్వమును రామకృష్ణున కారోపించిరిగాని యం దొకపద్యము నైనను జదివినవారి కాపాడుపుస్తకమునందు జూపినయహంభావమునుబట్టి యిత డితరకవులగ్రంథముల నాక్షేపించి పద్యములు చెప్పెనన్నంతవఱకు నమ్మవచ్చును.

ఈరామకృష్ణకవికి మొట్టమొదట రాజాస్థానమునందు బ్రవేశము కలుగకపోయినను రాజపురుషుల నాశ్రయించి వారిమీద పద్యములు చెప్పి వారిమూలమున కడపట రాజానుగ్రహము సంపాదించుకొనెనట! అట్లయ్యు నితడు సాధుస్వభావము కలవాడు కానందునను, పరుల వంచించుటయందును పరిహసించుటయందును ఆసక్తికలవా డయినందు