పుట:AndhraKavulaCharitamuVol2.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపింగళివారి పేకికథను జను లీప్రాంతములయం దిప్పుడు సహితము వాడుకగా చెప్పుకొనుచున్నారు. పింగళి గోంకనామాత్యు డొకనా డరణ్యములో సంచరించుచుండగా, ఆతని కొకసుందరమయిన పూస దొరకినదట. అతడాపూసను దెచ్చి తనపెట్టె లోవేసి దాచెనట. ఆదినమునందే పేకి యనుపేరుతో నొకతెవచ్చి వారియింట దాసిగా కుదిరి మిక్కిలి విశ్వాసముతో పనులు చేయ మొదలు పెట్టెనట. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత గోంకనామాత్యుని భార్య గర్భవతియై ప్రసవసమయము సమీపించినప్పు డాపురిటింటిలో పేకిని కావలి పెట్టిరనియు, అది యా కావలియున్నదినములలో నొకనాటిరాత్రి తాను శయనించిన స్థలమునుండి లేవకయే నాలుకను దీర్ఘముగాచాచి దానితో దీప మెగసనద్రోచెననియు, అది చూచి యాతని భార్య భయపడి జరగిన వృత్తాంతమును మఱునాడు భర్తతో చెప్పెననియు, అందుమీద వారు దాని నేలాగుననైన వదల్చుకోవలెనని యెటువంటి యసాధ్యము లయినపనులు చెప్పినను పేకి వానినెల్ల నిమిషములో నిర్వహించుచు వచ్చెననియు, అందుమీద వారు దానిని వదల్చుకొను సాధనములేక కాశికిపోయి గంగతెమ్మని దానిని దూరదేశమునకు బంపి యది యింట లేని సమయమందు సమస్తసామగ్రితోను పొరుగూరికి లేచిపోయిరనియు, ఇంతలో పేకి కాశినుండి గంగతీసికొనివచ్చి యింటివారు పొరుగూరికి పోవునప్పు డింట దిగవిడచిపోయిన నలువు రెత్తలేని పెద్దరాతిరుబ్బు రోటిని నెత్తిమీద పెట్టుకొని యిది మఱచి వచ్చితిరని పొరుగూరికిపోయి వారికీ చేర్చినదనియు, అప్పుడు గోంకనామాత్యుడు నీవు మమ్మెట్లు విడిచెదవని దానిని మంచిమాటలతో నడుగగా నా డరణ్యములో దొరకిన పూస నిచ్చివేసినయెడల పోయెదనని యది చెప్పెననియు అంతట దానియభితమునుదీర్చి వారు దానిని పంపి వేసిరనియు, కథ చెప్పుచున్నారు.