పుట:AndhraKavulaCharitamuVol2.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈకవి పూర్వులు మొట్టమొదట కృష్ణామండలములోనివారయినను, తరువాత దక్షిణదేశమునకు బోగా కృష్ణదేవరాయని యనంతరము నందు విజయనగరరాజ్యము చెడి యనేకులైన చిన్నచిన్న రాజుల యధీనమయి యున్నకాలములో నితడు కందనూలు (కర్నూలు) మండలములోని యాకువీడు, నంద్యాల, మొదలగుసంస్థానములలో జేరినట్టు కానబడుచున్నది. ఈతడు కృష్ణదేవరాయనియొక్క యాస్థానకవీశ్వరులయిన యష్టదిగ్గజములలో నొక్కడని కొందఱు చెప్పురు గాని యీకవి యాకాలమునందు గాని యాస్థానమునందుగాని యున్నట్టు నిదర్శనము లేవియు గానరావు. ఈసూరకవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నట్లూహించుట కనేక నిదర్శనములు కనబడుచున్నవి. ఈ కవి రచించిన కళాపూర్ణోదయము నంద్యాల సంస్థానాధిపతియైన కృష్ణరాజున కంకితము చేయబడినది. ఈకృష్ణరా జార్వీటిబుక్కరాజుయొకా యాఱవ సంతతివా డయినట్లు కళాపూర్ణోదయములోని కృతిపతియొక్క వంశానువర్ణనమువలన స్పష్టముగా గానబడుచున్నది. ఆర్వీటి బుక్కరాజుయొక్క పెద్దకుమారుడు సింగరాజు; అతని పుత్రుడు నరసింగరాజు; ఆతని పుత్రుడు నారపరాజు; ఆతని పుత్రుడు నరసింగరాజు; ఆతనిపుత్రుడు కళాపూర్ణోదయము కృతినందిన కృష్ణరాజు. ఆర్వీటి బుక్కరాజు క్రీస్తుశకము 1473 వ సంవత్సరము మొదలుకొని 1481 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. అటుతరువాత వచ్చిన యతని సంతతివారు నలుగురు నొక్కొక్క రిరువదేసి సంవత్సరము లుండి రనుకొన్నపక్షమున, ఈకృష్ణరాజు క్రీస్తుశకము 1560 వ సంవత్సరప్రాంతముల నున్నట్లెంచవలసి యున్నది. ఈకృష్ణరాజు విజయనగరమును సదాశివదేవరాయలు పాలించుచుండిన కాలములో నంద్యాల రాజయి యున్నట్లు కానబడుచున్నది. కృష్ణదేవరాయల యనంతరమున 1530 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చిన యచ్యుతదేవరాయడు 1542 వ సంవ