ఈ గుహాలయములోని శిల్పసంపద ముందు చూచిన వాటిలోని శిల్పములకన్న పరిణతి దశను కలిగియున్నది. నేర్పరులైన శిల్పులు దీనిని నిర్మించినట్లు తోచుచున్నది.
ఐదవదానివలెనే ఈ గుహాలయము 5 అ॥చతుర స్రాకారమును గలిగియున్నది. (20,24, 36 వ చిత్ర పటములు చూడుము) ఇందును శివలింగము,పానవట్టము గలవు. శివలింగము నల్లరాతితో చేయబడి మెరుపును గలిగియున్నది. ద్వారపాలకులు 5వ గుహలో నున్నట్లే యున్నారు. వీరి ప్రక్కలలో బ్రహ్మ,విష్ణు అర్ధశిల్పాలు ఉన్నవి (26,27, 28 వ చిత్రపటములు చూడుము). ఉత్తరవైపునున్న ద్వారపాలకునకు శృంగముతో కూడిన తలపాగ గలదు. ఈ గుహాలయము ముందు 12 ½ అ॥పొడవు,3 ½ అ॥వెడల్పు గల ప్రాంగణము చెక్కబడియున్నది. దీని ఉత్తరవైపున గల భిత్తికపై శివ ప్రతిమ చిన్నదిగా మలచబడియున్నది దాని చెంత శిలాక్షరములు గలవు. మండపము ముఖభాగమున రెండువైపులా కొనలందు కుఢ్య స్తంభాలు గలవు. ఈ రెండింటి మధ్య రెండు స్తంభములున్నవి. ఇవి 'అండము' మధ్యభాగాన అక్టాగనల్ విభాగమున కలిగియున్నవి. 'కాపిటల్' విభాగమున శిల్పములు గలవు. వీటి 'కార్బెల్' సాధారణ వంపు (simple corbel) గలిగియున్నవి. 'తరంగ' లేక 'తరంగ పట్టా' రూపులేఖలు లేవు (20వ చిత్రపటమును చూడుము). స్తంభములకు, కుఢ్యస్తంభాలకు పైన గల దూలము వంటి విభాగములో 'గణహారము' గలదు. ఈ దూలము పైన 'కపోత' క్వార్టర్ సర్కిల్ నిర్మాణములో గలదు. దీని ముఖభాగాన కూడు డిజైన్ల వరుస గలదు. ప్రాంగణాన కుడి, ఎడమల రెండువైపులా గణేశ, చండేశ అర్ధశిల్పములు ఉన్నవి. ఈ గుహాలయములోని శిల్పసంపద కూడ ఐదవ గుహాలయములోవలె పరిణతి దశకు చెందినదిగా ఉన్నది. ఇచట నంది లేదు.
ఇచ్చటి గుహలన్నింటిలోను, తొలి నాల్గింటికంటెను తరువాతిదై సుందరమగు శిల్పనైపుణి గలిగి మహాబలిపుర శిల్పసౌందర్యమును ఇది స్ఫురింపజేయుచున్నది. ఆరవదానివలెనే 5 ½ అ॥చతురస్రముగ, సలింగముగ మలచబడి ఉన్నది (21,22, 34 36 వ చిత్రపటములు చూడుము). ద్వారమున కిరువైపులా పెద్ద ద్వారపాలకుల శిల్పములు గలవు (26,27, 28వ చిత్రపటములు చూడుము). ఉత్తర వైపున గల ద్వారపాలకుడు 'శృంగము','పాగా' ధరించియున్నాడు. ఆకారములో మానవ పరిమాణములో గలవు. దక్షిణవైపున ఉన్న ద్వారపాలకునకు అణగినట్లుండు 'తలపాగా', కుఱచ జడలును గలవు. ప్రాంగణము చెక్కుచెదరక యున్నది. ముందుండు మండపము సుమారు 15 అ॥పొడవు, 5 అ॥ వెడల్పు కలిగి యున్నది. దీనిని మోయు రెండు స్తంభముల మూలములలో (base) 'ఆసీన' సింహాకృతులున్నవి (22వ చిత్రపటము చూడుము). స్తంభములమీద మూడు చిన్న శాసనములు గలవు. రెంటిలో శ్రీశైలమువి. అనంతజ్యోతి అను పరివ్రాజకుల నామములున్నవి. మూడవదానిలో 'శ్రీ కరువది ఆచార్ల కోసిన పనియు' అని యున్నది. అనగా ప్రఖ్యాతుడగు కరువది ఆచార్యునిచే ఈ దేవగృహమంతయు మలచబడినట్లు తెలియుచున్నది.
మండపము మూలలకు దగ్గరగా ద్వారపాలకుల ప్రక్కన బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములున్నవి (26,27, 28 చిత్రపటములు చూడుము). ఈ రెండిటికీ కొంత ఎత్తైన పీఠములు కలవు. మండపము ముందు విభాగమునందు ఉత్తర దక్షిణ కొసలలో రెండు కుఢ్యస్తంభాలు గోడలో ఇమిడియున్నవి. మండప ముఖభాగాన కుఢ్యస్తంభాలకు మధ్య