పుట:Andhra-Bhashabhushanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

25

ఆ. ఎలమి నీవు మీరు నే నేము ప్రథమలు
    నిన్ను మి మ్మనంగ నన్ను మమ్ము
    నన ద్వితీయ లయ్యె నని యుష్మదస్మత్ప
    దములు దెలియ నూత్నదండి సెప్పె. 106

క. నీమీలకు నామాలకు
   ధీమహితా వరుసతోఁ దృతీయాదులయం
   దేమఱక చేతనాది
   స్తోమం బిడ నేకబహువచోనియతి యగున్. 107

క. దేవా నీచే నీకున్
   నీవలనన్ నీధనంబు నీయం దనఁగా
   దేవా మీచే మీకున్
   మీవలనన్ మీధనంబు మీయం దనఁగన్. 108

క. దేవా నాచే నాకున్
   నావలనన్ నాధనంబు నాయం దనఁగా
   దేవా మాచే మాకున్
   మావలనన్ మాధనంబు మాయం దనఁగన్. 109

వ. అనంతరంబ సమానంబు లెఱింగించెద మొదలిపదంబు విభక్తులఁ బుచ్చి మీఁదిపదంబులతోడ సమ్యక్సంసక్తంబు లగుటం జేసి సమాసంబు లయ్యె నని పూర్వపదార్థప్రధానంబును