పుట:Andhra-Bhashabhushanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

19

క. సోఁడిగ బహువచనంబులు
   వీఁ డనుచో వీండ్రు వీరు వీరలు నయ్యెన్
   కాఁ డనఁ గాం డ్రనఁ గా ఱన
   వాఁడునకున్ వాండ్రు వారు వారలు నయ్యెన్. 72

ఆ. కొఱను నెఱను నాఁగఁ గొలను నా మ్రా ననఁ
     గలను గనను కెలను వలను నాఁగఁ
     బరఁగుశబ్దములకు బహువచనంబుల
     నులకుఁ గులు విధించె నూత్నదండి. 73

క. కొఱఁకులు నెఱఁకు లనంగా
   మఱియుం గొలఁకులును రేఁగుమ్రాఁకులనంగా
   మెఱయున్ గలఁకులు గవఁకులు
   నెఱకెలఁకులు వలఁకు లనఁగ నెగడెడికతనన్. 74

ఆ. ఇల్లు కల్లు ముల్లు పల్లు వి ల్లన నివి
    బహువచనము లగుచుఁ బరఁగు నెడల
    నిండ్లు కండ్లు ముండ్లు పండ్లు విం డ్లనఁ జను
    నుతగుణాభిరామ నూత్నదండి. 75

తే. పేను చేను మీ ననునివి పెక్కులైనఁ
    బేలు చేలు మీలు ననఁగఁ బోలు జగతి
    యిలకుఁ దులువొందు నొకకొన్ని యిలనడంచి
    లులబహుత్వమునం దుది మెలఁగుచుండు. 76