పుట:Anandam Manishainavadu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సం"గతులు

అదే గొప్ప అవార్డు

1983 నాటికి అత్తిలి మండలంలోని బల్లిపాడు శివారు పెదపాడు కుగ్రామం అనే పేరుకు నిదర్శనం. ఆనాటికి ఆ గ్రామంలో సంపన్నులు లేరు. అందరూ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న పేదలే. ఐతే విద్య విలువ తెలిసిన మనుషులు కావడంతో చదువంటే ప్రాణం పెట్టేవారు.

అప్పుడే రమణ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా చేరారు. అంతవరకూ ఏకోపాధ్యాయ పాఠశాల. పామర్తి సుబ్బారాయుడుగారు ప్రధానోపాధ్యాయులు. ఆయన రిటైర్‌మెంటుకు చేరువయ్యి, దూరాన తణుకు నుంచి సైకిల్‌పై రావాల్సి రావడంతో సెలవులు అవసరమయ్యేవి. అప్పటిదాకా ఒకడే ఉపాధ్యాయుడు కావడంతో సెలవులు పెట్టేవీలుకూడా లేక చాలా సెలవులు మిగిలాయి. రమణ చేరడంతో ఆయన రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఆ సెలవులన్నీ ఉపయోగించుకుని స్కూలు భారం ఆయనకు అప్పగించారు.