పుట:Anandam Manishainavadu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆవరణ నందవనం అవ్వాల్సిందే. ఎన్నో రకాల పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసి అవన్నీ పండించేవారు. పిల్లలు కూడా స్కూలు అయిపోయాకా మాతో ఉండి వద్దన్నా మొక్కల సంరక్షణ చూసేవారు. కాయగూరలు కోసి అందరికీ పంచినా తాను స్వయంగా పూలు కోయడానికి మాత్రం చాలవరకూ ఇష్టపడరు. ఎందుకంటే నవ్వులు చిందించే పువ్వులు కోయడానికి మనసు రాదు మాస్టారూ అని సమాధానం ఇచ్చేవారు. ఆయనకు అంతి ప్రశాంతర బహుశా ఈ ప్రకృతి పరిశీలన, ఆరాధనల వల్లనే వచ్చిందేమో.

హాస్యప్రియులు : _ ఆయన ఉన్నచోట ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. ఎవరినీ నొప్పించకుండా చక్కని జోకులు వేసి నవ్వించడం ఆయన సొంతమైన వరం. ఆడే మాటలోనూ, చేసే పనిలోనూ హాస్యాన్ని మేళవిస్తారు. చాలా వేదికలపైన ఎన్నో లఘు హాస్య నాటికలు వేసి సెభాష్ అనిపించుకున్నారు. నాలో ఉన్న నటుడిని వెలికితీసిన వ్యక్తి మాస్టారే. సభలు, సమావేశాల వేదికమీద ఆయన ఉన్నారంటే చాలు, ఆ వేదిక ఆహ్లాదభరితమే.

ఆయన మాటే మంత్రం : - కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు, చదువులో సమస్యలు, భవిష్యత్ ప్రణాళికల్లో అయోమయం వంటివి ఆయన చిన్న ఆలోచనతో పరిష్కరించారు. అలానే చదువులో నిరాసక్తత, జీవితంలో నిరాశ ఏర్పడినవారికి తన మాటలతో ఉత్సాహం కలిగించగలరు. ఆయన ఎందరో విద్యార్ధుల జీవితాలు ఒక్కమాటతో మలుపు తిప్పారు. ఆయన మాటతో స్పూర్తిపొంది రామలక్ష్మి అనే పేద విద్యార్ధిని ఆంధ్రవిశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సీటు సాధించి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన నాగమణి అనే అమ్మాయి "నువ్వు నాలా టీచర్ కావాలి" అన్న మాస్టారు మాటను నిజం చేసేందుకు అడ్డంకి కాకుండా తన భర్తను డిగ్రీ చేయించింది, ఆ తర్వాత తాను ప్రభుత్వ ఉపాధ్యాయిని అయి, అలానే తమ్ముణ్ణి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మలిచిందంటే ఆయన మాటలలోని శక్తి తెలుస్తుంది. డి. కుముదవల్లిలో పందులను కాసుకునే కుర్రాడు మాష్టారి ప్రోత్సాహంతో ఉపాధ్యాయుడయ్యాడు. ఆయన శిష్యులు ఉపాధ్యాయులుగా, రక్షణశాఖ ఉద్యోగులుగా, మరెన్నో గౌరవనీయమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు.