పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        జరఠత్వము సమసిపోయె
        విరియబూచె నవకాంక్షలు
        జయ జయ జయ జయవసంత
        జయ మధుదేవా!
చిగిరించెను మ్రోడుమ్రోక
రగిలించెను కోర్కె రేక
        నీ కొరకే ఎదురు చూచు
        మా కన్నులు కాంతినిండె
        జయ జయ జయ జయవసంత
        జయ మధుదేవా!”

ఆ బాలలు సుగంధజలముల వసంతునకు అభిషేకము చేసినారు. లక్షలకొలది. మల్లెలు, మొల్లలు, మాలతులచే వీరపురషప్రభుని పూజించినారు. వసంతదేవాభిషేక మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. వసంత దేవుడంత చెలికత్తెలు కూడరా బయలుదేరి ఉద్యానవనం అంతా నాట్యాన పరిభ్రమించడం ప్రారంభించాడు.

ఆంధ్రసామ్రాజ్య మహాసామంతుల తనయలు, మహాతలవరుల తనయలు, మహాదండనాయకుల తనయలు, అనేకు లీయేటి వసంతోత్సములకు విజయపురికి వేంచేసినారు. శ్రీ వీరపురుషదత్తప్రభువు తనకు అనుగు చెలికాడైన విదూషకునితో, తానే ఎన్నుకొన్న మలయపవనదేవునితో, భృంగదేవునితో సరససల్లా పాలాడుతూ ఆవేదనపడుతూ వనరమకై వెదుకుతున్నాడు.

శాంతిమూల మహారాజు మేనమామలు ఉత్తరకళింగాధిపతులైన వాసిష్టులు యశోవర్మ మహారాజు, ఆ మేనమామ కొమరుడు దుర్జయవర్మ, దుర్జయ వర్మకొమరిత భట్టిదేవి.

విజయపురిలో జరిగే ఈ వసంత మహోత్సవాలకు దుర్జయవర్మ మహారాజు కొమరితతో, తన మహారాణితో సపరివారుడై విచ్చేసినాడు. ఈ ఉత్సవంలో భట్టిదేవి తన చెలికత్తెలతో వచ్చి పాల్గొంటున్నది. భట్టి అందాల బాల. ఆమె మోము గుండ్రనై పద్మాకారంగా ఉంటుంది. ఆమె విశాలనయన, సంతత హాస ప్రపుల్ల వదన. గడుసరి కాదు. అమాయిక, భట్టిదేవి అందము కామధేనువు అందము. ఆమె ఆనాడు వీరపురుషదత్త ప్రభువును వసంత దేవునిగా అలంకరించిన బాలికలలో ఒకరిత.

ఆమె తక్కిన బాలలతోపాటు తన్ను అలంకరిస్తున్నప్పుడే వీరపురుషదత్తప్రభువు ఎవరా ఈ బాలికయని ఆశ్చర్యం నిండిన ప్రశ్న వేసుకొన్నాడు. భట్టిదేవి మోమున పూంగీయ శాంతశ్రీ మోమునవెలిగే విద్యాకాంతులు లేవు కాని, పూర్ణశ్రీ కాంతులు, గంధపు తరువును చందన పరిమళ మలమిపోయినట్లే అలమిపోయి ఉన్నవి. ఆ బాలిక ప్రతి అవయవమూ యౌవనరాగాన్ని సౌందర్యశ్రుతిలో పాడే విపంచికాతంత్రి అయినది. ఆ బాలిక ఎదుట నిలుచుండిపోయినాడు యువరాజు. యువరాజు వెంట వచ్చే నంది యువరాజు నుద్దేశించి “జయము జయము మహాప్రభూ! ఈ దివ్యసౌందర్యగాత్ర అయిన రాజకుమారి ఉత్తరకళింగ

అడివి బాపిరాజు రచనలు - 6

46

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)