పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారాజులైన దుర్జయవర్మ మహాప్రభువుల తనయ వాసిష్టీగోత్రజ భట్టిదేవి” అని మనవి చేసెను.

వెంటనే తన తండ్రి శాంతిమూల మహారాజు వాక్యాలుగా బ్రహ్మదత్త ప్రభువు తనతో చెప్పిన మాటలు రాజకుమారునకు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చిరునవ్వుతో “రాజకుమారీ! మాకు వనలక్ష్మిగా అవతరించావు" అని పలికినాడు. రాజకొమరిత చెలి ఒకర్తు నవ్వుతూ చేతులుమోడ్చి “మహారాజ కుమారా! మీరు మా భర్తృదారికను వనరమగా ఎన్నుకొని రసజ్ఞ శేఖరత్వం ప్రకటించారు. రాకుమారి తమచే బహుకృత అయింది” అని విన్నవించుకొన్నది. ఈ సంఘటన గమనిస్తున్న పూంగీయ రాకుమారి శాంతశ్రీకి పట్టరాని కోపమువచ్చి విసవిస నడిచి రథమెక్కి తనచెలులు కొలిచిరా భవనానికి వెళ్ళిపోయింది.

19

హారాజకుమారి భట్టిదేవిని వనలక్ష్మిగా ఎన్నుకోగానే ఆ మహోద్యానవనములో వివిధ ప్రాంతాలలో ఉన్న వందలకొలది బాలికలు ఆమె చుట్టూ మూగినారు. పాటలు పాడుతూ నాట్యమాడినారు. పూలతో లతలతో అలంకరించినారు. బాలకులందరూ వసంతుని పొదివికొని నాట్యమాడుతూ, పాటలు పాడుతూ తీసుకొని వచ్చి వనమధ్యాన లతలతో పూలతో మనోహరంగా అలంకరించిన పూలవేదికపై అధివసింపచేశారు. ఇంతలో బాలికలందరూ పాటలు పాడుతూ, నాట్యమాడుతూ వనదేవిని తీసికొని వచ్చి వసంతుని ఎడమ పక్క ఉన్న కుసుమాసనంపై అధివసింప చేసిరి. యువతీ యువకులందరూ కలిసి కుసుమభృంగ నాట్యం కావించారు. నాట్యం పూర్తికాగానే బాలికలందరూ మన్మధుని ఎన్నుకోవాలి.

ఈ నాట్యాలు, ఈ ఆనందం గమనిస్తూ చిరునవ్వు నవ్వుకుంటూ కొంచెం దూరంగా బ్రహ్మదత్తప్రభువు నిలిచి ఉన్నాడు. అతని బాపిశ్రీ రాకుమారి గమనించింది. ఆమె కేమి బుద్ది పుట్టిందో ఆ ప్రభువు వంక తీక్షణవీక్షణాలు పరపింది. అతని సమున్నత రూపమూ, దృఢాంగ బలము, అఖండ జ్ఞానవికాంతివిలసిత సుందరవదనమూ చూచింది. ఇన్ని దినాలనుండి ఆ ప్రభువు ఈ వేడుకలలో పాల్గొనుటలేదు. ఈ ప్రభువు వట్టి విరాగి. జీవితం ప్రక్కనుంచి తప్పుకొని పోవాలని చూచే యువకుడు. ఈయన తనకు అన్న అయితే ఎంత బాగుండును అని బాపిశ్రీ అనుకున్నది. బాపిశ్రీ తన మేనమామ శాంతిమూలమహారాజును భగవంతునిగా పూజిస్తుంది. ఆయన హృదయము పూగీయ శాంతశ్రీతోపాటు ఈ బాలికయు అర్ధముచేసుకొన్నది. తమ వదిన శాంతిశ్రీ ఏ యోగినీ లోకం నుంచో దారి తప్పి వచ్చింది. ఆ అందాలరాణిని ధనక ప్రభువైన స్కంద విశాఖాయనక బ్రహ్మదత్తునికీయ మహారాజు సంకల్పించి ఉన్నాడని బాపిశ్రీ శాంతశ్రీలు గ్రహించారు. ఇట్లు యోగివంటి ఈ ప్రభువు అటు యోగినివంటి తమవదిన అనుకొన్నది బాపిశ్రీ. తన పెత్తల్లి కొమరిత పూంగీయరాకుమారి శాంతశ్రీ ఎందుకు కోపంవచ్చి వెళ్ళిపోయిందో తనకు అప్పుడే అర్థమైంది. తామిద్దరూ యువరాజును సమంగా ప్రేమించారు. తమనిద్దరినీ యువరాజు సమంగా ప్రేమిస్తున్నాడు. అలాంటిది వనదేవతగా

అడివి బాపిరాజు రచనలు - 6

47

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)