పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మదత్తుడు చిన్నతనంలో తాను తామ్రలిప్తినుండి తామ్రపర్ణి వరకు ప్రయాణం చేసిన విషయం జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మొదటి దినాలలో భయంవేసింది. భోజనాదికాలు ఓడమీదనే. ఎక్కడా భూమి కనబడలేదు. ఆ సముద్రమధ్యంలో నావికులు తమ దారి తెలుసుకోవడం అత్యద్భుతమైన విషయం వారు నక్షత్రాలు చూచేవారు రాత్రులు. సూర్యుణ్ణి చూచేవారు పగలు. మేఘాలు ఆకాశం నిండిపోతే గాలివెళ్లే తీరు మొదటినుంచి గమనిస్తూ ఓడ నడుపుతుంటారు.

12

బ్రహ్మదత్తుప్రభువు నదీతీరంనుండి రథముపై రాచనగళ్ళవైపు వెళ్ళినాడు. ఆ మరునాడే తాను మహారాజకుమారికకు విద్య ప్రారంభింపవలసిన శుభముహూర్తము. నగరమున అన్ని వీధులు రథపథములు కావు. కాబట్టి పెద్దవీధుల వెంటనే రాచనగళ్లున్న కోట ప్రక్కనుండి మరల కృష్ణ ఒడ్డుకు వచ్చి, రెండు గోరుతముల దూరముపోయి, తన పండ్లతోటను చేరినాడు. అచ్చటి వనాలలో సమస్త ఫలజాతులు పండుతవి. మామిళ్ళు విరివిగా పిందెలతో నిండి ఉన్నవి. పనసపిందెలు దిగుతున్నవి. అరటిచెట్లకు మనిషి ఎత్తుగెలలు వ్రేలాడుతున్నవి. అవి ఎప్పుడూ గెలలు వేస్తూనేఉంటాయి. నిమ్మలు పూలతో పిందెలతో నిండి ఉన్నవి. పెద్ద నేరేడులు పూతతో పిందెలతో నిండి ఉన్నవి. ద్రాక్షపళ్ళు పిందెలతో నిండి ఉన్నాయి. పూగీ వృక్షాలు గెలలు దిగుతున్నవి. శీతాఫలములు కాపు కాస్తున్నవి. నదీతీరం పొడుగునా పెద్దదోసపాదులు పందెళ్ళపై పాకుతున్నవి. నాగ రంగములు బంగారు ఎరుపు పళ్ళతో నిండి ఉన్నవి. నారికేళాలు ఆకాశం అంటుతూ జటలు దెసలక్రమ్మాగా నాట్యంచేసే శైవులులా ఉన్నవి.

బ్రహ్మదత్తుడు తిన్నగా తోటలోనికిపోయి భవనం ముందు రథము దిగినాడు. బ్రహ్మదత్తప్రభువు వస్తూ ఉండగానే తోటమాలీలు నమస్కారాలు చేస్తూ ఉండిరి. ఆ ప్రభువు రథము దిగగానే సూతుడు రథము తోలుకొని పోయినాడు. కృష్ణకు, నూరు వివర్తనములున్న ఆ తోటకు ఒక నగపంక్తి అడ్డమున్నది. ఒక్క దిక్కుననే తోటలోనుండి కృష్ణవరకూ లోయదారి. ఆ లోయనడుమ సంతతము ప్రవహించే చిన్న సెలఏరు ఉంది. ఆ నూరు నివర్తనముల తోటలోను ఎన్నో కూపాలూ, ఒక క్రీడాసరస్సూ, ఒక నడబావి. సరస్సుచుట్టూ సమస్త పుష్పజాతుల వృక్షాలున్నాయి. బ్రహ్మదత్త ప్రభువు ఆ సరస్సు ప్రక్కనే ఉన్న తిన్నెపై కూర్చుండినాడు. సూర్యుడు అప్పుడే ఆకాశం మధ్యకు వస్తున్నాడు. భోజనం వేళ అయినా, ఆయన కాగొడవే తట్టలేదు.

చక్రవర్తి మహావృద్దు. అవసాన దినాలు; కుమారుడు వీరసుడు. ఇక్ష్వాకు మహారాజే దేశాలలో ధర్మం నడుపగల మేటి వీరుడు. ఆయన చక్రవర్తి అల్లుడు. పులమావి కుట్రలు చేస్తున్నాడు. ఆయనకు అభీరులూ, క్షాత్రవులూ సహాయం చేస్తామంటున్నారు. పులమానికి శ్రీశాంతిశ్రీ మహారాజకుమారికను వివాహం చేసుకుందామని ఉన్నది. శాంతిశ్రీ కుమారి త్రిజగన్మోహిని. బాలలకు అంత అందము ఉండడంవల్ల ఒక్కొక్కప్పుడు రాజకీయాలలో కష్టములు సంభవిస్తాయి. ఆ బాలకు తాను చదువు చెప్పాలట. రేపే ఆ శుభముహూర్తము.

అడివి బాపిరాజు రచనలు - 6

35

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)