పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయపురంనుంచి వజ్రాలు, బియ్యము మొదలగు ధాన్యాలు, నూలు, కంబళ్ళు, ఉన్నివస్త్రాలు, పొత్తుబట్టలు, బంగారు వెండినగలు, కత్తులు, ఫలకములు, వర్ణములు, నువ్వులు మొదలగు నూనెవస్తువులు, పూగీఫలాలు, సంగీతవాద్య విశేషాలు, దూది, గాజులు, దంతపుశిల్పాలు, చింతపండు, ఉప్పు, సారాయములు సరుకు లెగుమతి అవుతవి.

ఆంధ్రదేశ వణిక్కులు, ఆంధ్రశిల్ప బ్రాహ్మణులు జగత్ర్పసిద్ధి నొందినారు. ఆంధ్ర నేతపని లోకపూజ్యము. అన్ని కుటుంబాలవారు వడికేవారు. సర్వసాధారణంగా ఆంధ్రులు వడకిన నూలు సాలిపురుగు దారాలకన్న సన్నంగా ఉక్కు తీగలకన్న బలంగా ఉండేది. కొన్ని మడతలుపెట్టి కట్టుకొన్నా ఒళ్ళు కనబడేది ఆంధ్ర స్త్రీలు వడికిన వలువలలో. అలాంటి నూలును నేయడంలో, ఆ నూలుకు రంగులద్ది చిత్రవర్ణ వస్త్రాలు నేయడంలో ప్రపంచంలో ఆంధ్రతంతుకారకుల మించిన వారింకొకరు లేనేలేరు. తెల్లని వస్త్రములు చేసిన వెనుక వర్ణకారకులు రంగులు అత్యంత మనోహరంగా అద్ది పూవులు లతలు మొదలయిన అలంకార శిల్పాలుగా సిద్ధం చేసేవారు. వస్త్రాలు లాతి విలాతులవారు ఎగనెత్తుకుపోయేవారు ఈ గొఱ్ఱెలను పెంచి ఉన్ని తీసి, ఆ ఉన్నిని ఓషధీరసంతో కడిగి శుభ్రంచేసి చిత్రవిచిత్రంగా కంబళ్లు, రత్నకంబళ్ళు, శాలువలు మొదలయినవి అల్లేవారు. ఆంధ్రభూమిలో, రజితమును నూలుపై పోతపోసిన దారము రజని అని పారశీకులు సిద్ధంచేసేవారు దానిని సరజ లేక సరిగ అనే వారు ఆంధ్రులు. ఆ సరిగ వస్త్రాలలో అంచులు పువ్వులు లతాదికాలూ నేసేవారు. ధాన్యకటకము, విజయపురి మొదలయిన మహాపురాలలో ఈ వస్త్రశిల్పం విరివిగా చిరకాలమునుండి జరుగుతున్నది. బ్రహ్మదత్తునికి ఆంధ్రశిల్పులన్నా, ఆంధ్రవస్త్రకారులన్నా అపరిమితాదరం. రోమక, యవన, నీలాది ద్వీపాలలో భారతీయ వస్త్రాలకు, శిల్పపుపనికి ఉన్న గౌరవము విన్నప్పుడు బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయేవాడు.

ఓడలు అనంతమైన సముద్రంలో నిర్భయంగా తేలిపోతున్నాయి. వరుణ దేవునికి కోపం రాకుండా ఉంటే ప్రయాణంలో ఓడలకేమీ ముప్పం లేదు. గాలివేగము వానికి తోడవుతుంది. ఓడలకు మహాసముద్ర మధ్యమందుండే ప్రవాహ భేదాలు సహాయమవుతాయి. లేదా, తెడ్లు వేసుకొని, ఆంధ్ర నౌకలు ప్రయాణం చేస్తాయి. ఓడలు నడపటంలో ఆంధ్ర నావికులు పేరుపొందినారు. నాలుగువందల గోరుతాల సముద్రతీరం పొడవునా వరుణదేవుడు ఆంధ్ర నావికులను వాత్సల్యంతో చూస్తాడు. అహో! వీరుకదా వరుణదేవుళ్ళు అని బ్రహ్మదత్తుడు అనుకున్నాడు.

తెరచాపలన్నీ ఎత్తి, సముద్రాన్నే ఆకాశంచేసి, ఓడ రాజహంస అయి తేలిపోతూ ఉంటుంది. నావికులు పాటపాడుతూ ఉంటారు. లోపల యాత్రికులు ఉంటారు. యవద్వీప భాషలో నావికా నాయకుణ్ణి “సరాంగు” అంటారట. ఆ నాయకుడే ఓడకు కళ్ళు. మెదడూను. వారి పాట ఎంతో మధురంగా ఉంటుంది. భూమి మనుష్యుల తల్లి. సముద్రుడు నావికుల తండ్రి, వారికి తల్లి ఆకాశం, నక్షత్రాలు సహోదరీమణులు. సూర్య దేవుడు సోదరుడూ, గురువూ. చంద్రుడు ప్రియురాలు. ఓడ రెక్కలు చాచి ఎగిరిపోతోంటే

అడివి బాపిరాజు రచనలు - 6

34

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)