పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

నేను ప్రేమిస్తున్నాను అని తారానిక అనగానే, అంతఃపుర రక్షకురాలు పకపక నవ్వుతూ, “ఎవరిని?” అని ప్రశ్నించింది. తారానిక తలవాల్చుకొని “నాగదత్తుని” అని అస్పష్టంగా పలికింది. “ఎవరా నాగదత్తుడు?” పరిపాలకురాలు బుద్ధశ్రీ మాటలు కొంచెం కటువుగా ఉన్నట్లున్నాయి. “యశోదనాగనిక అన్నగారు. ” తారానిక తలఎత్తి సరే ఏమవుతుందో చూద్దాము అన్నట్లుగా మాట్లాడింది. “అదే నేనూ అనుకున్నాను. సరే నువ్వువెళ్లు. ఏ విషయమూ తర్వాత మాట్లాడుతాను” అన్నది ఆ అంతఃపురపాలకురాలు బుద్ధశ్రీ. తారనిక ఆలోచనా హృదయంతో వెళ్ళిపోయింది. నాగదత్తుని ప్రేమ అంతా ఆమెకు జ్ఞాపకం వచ్చింది. సాల గ్రామంలో జరిగిన వసంతోత్సవపు వేడుకలన్నీ ఆమెకు స్ఫురణకు వచ్చాయి. శైవాలినీప్రాంత విలాసక్రీడ అంతా జ్ఞాపకం వచ్చింది తారానికకు. ఆమె ఒళ్ళు ఝల్లుమన్నది.

నాగదత్తుని ప్రేమ తన్ను సుడిగుండంలా ముంచెత్తింది. నాగదత్తుడు తారానికకు తెలియకుండా తన మేనమామను విజయపురం తారానిక తండ్రి కడకు పెళ్ళిరాయబారం పంపించినాడు. ఆమె తండ్రి గౌతమస్వామి చాలా సంతోషకరమైనదనిన్నీ త్వరలో శుభముహూర్తాన ప్రధానం చేసుకోవలసి ఉంటుందనీ చెప్పినాడు. మేనమామ పూర్ణనాగుడు సంతోషంతో తిరిగి వచ్చి మేనల్లునికీ, బావగారికీ, తన అక్కగారికీ రాయబార ఫలితం వర్ణించాడు. నాగదత్తుని సంతోషానికి మేరలేదు. తల్లీ కొడుకూ, చెల్లెలూ తారానికకు సంతోషం కలిగించే ఒక విచిత్రవ్యూహం పన్నినారు.

తారానిక ఉదయస్నానం నిర్వర్తించి బొట్టుపెట్టుకొంటున్నది. చెంపలకు పుప్పొడి ఆద్దుకొంటున్నది. ఆ సమయంలో నగలమంజూష ఒకటి పట్టుకొనివచ్చి “కాబోయే తన కోడలుకు అత్తగారు ఈ భూషణమందసము బహుమానమట. రేపటినుంచి వసంతోత్సవాలు వస్తున్నాయి. ఆ ఉత్సవాలకు తారానికి వనదేవికావాలి” అంటూ “నీకిమ్మన్నది” అని యశోద గబ గబ వెడలిపోయినది. ఇంతలో నాగదత్తుని అన్నగారి కొమరిత వచ్చి, “పిన్నీ! ఈ చీరెలూ పల్లెలూ మా తాతయ్య తనకు కాబోయే కోడలికని ఇవ్వమన్నారు. ఇవి తీసికో తారపిన్నీ” అని చెప్పి అక్కడ ఆచీనాంబరాలమూట రత్నకంబళి పై ఉంచి పారిపోయింది. కొంతసేపటికి నాగదత్తుని ఆన్న కొమరుడు వచ్చి “పిన్నమ్మా! మరే మా నాన్న ఈ బంగారుకంకణాలు మా మరదలుకు బహుమతి అని నీకిమ్మన్నారు” అని అవి ఆమె ఒళ్ళో ఉంచి తుఱ్ఱుమన్నాడు.

అతడు వెళ్ళడమేమిటి వాని చిన్నతమ్ముడు వెంటనే అక్కడకు వచ్చి “ఇదిగో, తూలు, పిన్నాయీ! మలే మలే! మా బాబాయి ఈ ముత్తాల హాలం తన బారియకు బగుమతిత. నీకేఁబాబాయేఁ ఇమ్మన్నాలు.” తారానికి మెళ్ళో హారంవేసి, “నేను వెల్లుతున్నాను, నన్ను ఒక్కసారి పెత్తుకోవూ! అది మా బాబాయికి ఇవ్వాలిత” అన్నాడు. తారానిక ఆ బాలుని గబుక్కున ఎత్తుకుని హృదయానికి గాఢంగా అదుముకుని ముద్దులతో ముంచెత్తింది. “నన్ను పిన్నాయి పెత్తుకుందోయి” అంటూ పారిపోయాడు. తారానికి

అడివి బాపిరాజు రచనలు - 6

142

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)