పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమ భాగం

విజయపురం

అడవి బ్రహ్మదత్తప్రభువు ఉత్తమ కవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతి విశారదుడు. అతనికి కవిత్వావేశం కలిగితే ఆంధ్రప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాథలు, కావ్యాలు సృష్టిస్తాడు. అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతిని సేనాపతిత్వాన్ని మరచిపోతాడు.

అడవి బ్రహ్మదత్తప్రభువు ఆపస్తంబ సూత్రుడు, కృష్ణయజుర్వేద శాఖాధ్యాయి, విశ్వామిత్ర అఘమర్షణ దేవరాతత్రయార్షేయ సాంఖ్యాయనస గోత్రజుడు. బ్రహ్మదత్తుని తండ్రి ధనకమహారాజ అడవి ప్రియబల మహా సేనాపతి, దేవదత్తాభిధానుడు. బ్రహ్మదత్తప్రభువు తల్లి భరద్వాజ గోత్రోద్భవ, పల్లవబుద్ధీ చంద్రప్రభువు తనయ సాంఖ్యాయనస గోత్రము కౌశిక గోత్రోద్భవము.

ఆంధ్ర శాతవాహనులు కౌశిక గోత్రోద్భవులు. విశ్వామిత్ర సంతతి వారు. కాబట్టే వారు తమతో సంబంధాలు చేయుటకని భరద్వాజులను వాసిష్టులను కాశ్యపులను మాద్గల్యులను హరితసులను కుటుంబాలుగా కృష్ణా గోదావరీ తీరాలకు తీసుకొని వచ్చినారు. వారందరు మహాంధ్రులైనారు.

కౌశికులలో రానురాను రెండు వంశాలు ఎక్కువ ప్రాముఖ్యము సముపార్జించు కొన్నవి. ఒక వంశము ఆ కాలంలోనే కృష్ణవేణ్ణకు ఎగువ అడవులు నిండి ఉన్న శ్రీపర్వత ప్రాంతాల ఆశ్రమాలు ఏర్పరచి, ఆటవిక ప్రభువుల లోబరచుకొని, ఆర్యనాగరికత వారి కలవరచి, క్షత్రియత్వమిచ్చినారు. కొందరికి శూద్రత్వ మిచ్చినారు. ఆటవికులలో మంత్ర వేత్తలకు వైశ్యత్వ మిచ్చినారు. వారి దేశము ధనకదేశము, వారు ధనకులై నారు. వారు చక్రవర్తులగు శాతవాహనులతో విడపడ్డవారు అన్న గుర్తుగా సాంఖ్యాయనగోత్రం తీసుకొన్నారు.

ఈ కౌశిక గోత్రికులు విశ్వామిత్ర వంశంనుండి సూటిగా వచ్చినవారు. తమ వంశఋషి దర్శించిన గాయత్రి మంత్రమునకున్న సాంఖ్యాయనస గోత్రమును వారు గ్రహించిరి. అడవిని సస్యశ్యామలంగా, బహుజనాకీర్ణంగా చేసినారు. గనుక ఈ సాంఖ్యాయనులకు అడవివారు అను బిరుదనామం వచ్చింది. ఆ అడవి ఫలభూమి అవడంవల్లను అక్కడ అనేక బంగారుగనులు రత్నాలగనులు ఉండడంవల్లను, అది ధనకదేశం అయింది. వీరే కృష్ణాతీరంలో ధనకటక నగరం నిర్మించారు.

శ్రీపర్వతము వీరి పర్వతము. కృష్ణవేణ్ణ ప్రవహించే ఆ లోయ అడవి వారిది. వారు ఆ సీమకంతకు ఋషులు, ప్రభువులు. ఈ అడవి సాంఖ్యాయనులే విజయపురము నిర్మించారు. వీరే శ్రీశైలమునందు మల్లికార్జునదేవుని ప్రతిష్ఠించినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

• 6 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)