పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాతవాహన సామ్రాజ్యము స్థాపించిన ప్రథమార్య ఋషి కౌశిక గోత్రోద్భవుడైన దీపకర్ణి కుమారుడు శాతవాహనుడు. ఆ శాతవాహనులు విజృంభించి తమ ప్రథమాంధ్ర ముఖ్యపట్టణమైన శ్రీకాకుళము వదలి సాంఖ్యాయనులు శుభప్రదము కావించిన శ్రీపర్వతానికి దిగువ వారు నిర్మించిన ధాన్యకటక మహానగరమును, ధనకులకోరికమీద ముఖ్యనగరం చేసుకొన్నారు. ఆ భూమి బంగారు పంటలు పండేది. కాబట్టి ఆ నగరం ధాన్యకటక నగరం అన్న పేరు పొందింది.

శాతవాహన సామ్రాజ్యము విజృంభించిన కొలది అడవి సాంఖ్యాయనుల ప్రాబల్యము తగ్గి, శాతవాహనులకు వారు సామంతులై ధనకటకాన్ని శాతవాహనుల కర్పించినారు.

శాతవాహనులలో శ్రీముఖుడు పాటలీపుత్రపురం రాజధానిగా మగధ రాజ్యమూ, సకల భూమండలము సార్వభౌముడై ఏలిన సుశర్మ కాణ్వాయన చక్రవర్తిని ఓడించి, తాను ఆంధ్రదేశానికే కాకుండా సర్వభూమండలానికి చక్రవర్తి అయి మగధ సింహాసనం ఎక్కినాడు.

సూర్యచంద్రుల సంతతివారై కృతయుగ కాలంనుంచి మనుష్యానంద రూపులైన చక్రవర్తులు సకలభూమండలం ఏలుతూ ఉండేవారు. ప్రథమంలో ఇక్ష్వాకు వంశస్థులు అయోధ్యలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. అలా కృత త్రేతాయుగాలు గడిచి పోయినాయి. ఆ వెనుక కురువంశరాజు హస్తినాపురంలో ద్వాపర యుగంలో చక్రవర్తి సింహాసనల నెలకొల్పినారు. అభిమన్యు సుతుడు పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు మొదలయిన చక్రవర్తులకు బిమ్మట చక్రవర్తిత్వం శిశునాగవంశజులయిన మహా పద్మనందులకు సంక్రమించినది. వారు పాటలీపుత్రంలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. నందుల నాశనంచేసి మౌర్యులూ, వారిని నాశనం చేసి శృంగులూ వారిని నాశనంచేసి కాణ్వాయనులూ వరుసగా చక్రవర్తు లయ్యారు.

ఈ మధ్య రెండు పర్యాయాలు కౌశాంబిలో ఉదయనుని కాలంలో చక్రవర్తిత్వం ఉదయనుడు, ఆయన కుమారుడు నరవాహన దత్తుడు అనుభవించారు. కాని సింహాసనం పాటలీపుత్రంలోనే ఉండిపోయినది.

కాణ్వాయనుల నుక్కడగించి శ్రీముఖశాతవాహనుడు జంబూద్వీప చక్రవర్తి అయిన వెనుక, ఆంధ్రక్షత్రియులలో గుప్తవంశంవారు శాతవాహనులకు రాజప్రతినిధులుగా ఉండి శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నం కాగానే స్వాతంత్య్రం వహించి ఉత్తర భారతీయ చక్రవర్తు లయ్యారు.

ఇప్పుడు శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీశాతకర్ణి రాజ్యం చేస్తూ ఉన్నారు. అడవిస్కంధ విశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు తండ్రి ప్రియబల దేవదత్తుడు తపస్సు చేసుకొనుటకు శ్రీ శైలక్షేత్రాటవులకు వెడలిపోయినాడు. తల్లి భారద్వాజనియైన నాగసిరిదేవి కుమారునకు వివాహము కాగానే తానూ భర్తగారి యాశ్రమమునకు తాపసిగా పోవ సంకల్పించుకొని విజయపురమునందే ఆగిపోయినది.

అడివి బాపిరాజు రచనలు - 6

• 7 •

అడవిశాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)