పుట:Ammanudi july 2018.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి: 4 సంచిక: 5

అమ్మనుడి

జూలై 2018

సంపాదక హృదయం

జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం

ఈ సంచిక ముఖచిత్రాన్ని చూసి 'నడుస్తున్న చరిత్ర', 'అమ్మనుడి' పత్రికల పాఠకులు కొద్దిగా నివ్వరపోవచ్చు. ఎందుకంటే ఇదే ముఖచిత్రాన్ని 'అమ్మనుడి' తొలిసంచిక (మార్చి 2015)పైనా, 'నడుస్తున్న చరిత్ర'లోనూ చదువరులు చూసిందే. ఐనా దాన్ని ఇప్పుడు మళ్లీ ముద్రించాల్సిన అక్కర వచ్చింది. కారణం - 2011లో భారత ప్రభుత్వం సేకరించి, ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వెల్లడి చేసిన మాతృభాషల జనాభా లెక్కల వివరాలే.

తెలుగునుడి పటాన్ని పరిశీలించండి. దక్షిణ భారతదేశమంతటా ఎక్కువ ప్రాంతంలో చిక్కగా, చాలా ప్రాంతాల్లో పలుచగా పరచుకొని వున్న తెలుగువారి విస్తృతిని గమనించండి. అందులోని నేటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను గుర్తు పట్టగా - తక్కిన భాగంలో ఎంతగా మనవాళ్ళున్నారో నిశితంగా పరిశీలించండి.

వాళ్లు ఇప్పుడు మాతృభాషకు దూరమై, వివక్షకూ, అలక్ష్యానికీ, ఉదాసీనతకూ గురవుతూ జీవిస్తున్నవాళ్లు. ఒక విధంగా - పరాయీకరించబడుతున్న వాళ్ళు. స్వాభిమానాన్ని చంపుకొనో, అణచుకొనో బ్రతుకుతున్నవాళ్ళు. ఈ పరిస్థితి ముఖ్యంగా భాషా రాష్ట్రాల పేరుతో జరిగిన విభజన వల్ల వచ్చిందనే ఆరోపణ నెంతవరకు ఒప్పుకోవచ్చునన్నది చర్చనీయాంశమే అయినా, కారణాలేవైనా - పరిణామాల ఫలితాన్ని వాళ్ళనుభవిస్తున్నారు. చివరకు - తమ మాతృభాష 'తెలుగు' అనే గుర్తింపుకు కూడా దూరమైనారు. మాతృభాషాపరంగా వారి పరాయీకరణ ఈ 50-60 ఏళ్లలో వేగంగా జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు - పరిపాలన, విద్యారంగాల్లో ఇంగ్లీషుకు దాసోహమనడంతో - ఘన చరిత్ర, ఎంతోశక్తి కలిగిన మన భాషా సంస్కృతులు ఇక్కడ పరాయీకరించబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల బయట వున్నవారు స్థానిక భాషల ప్రభావంలో మునిగి తేలుతుంటే, తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఆంగ్లీకరణ మోజులో ఆత్మహత్యా సదృశంగా వ్యవహరిస్తున్నాయి.

భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు మౌలిక ఉద్దేశం మంచిదే అయినా దాన్ని అమలు చేసిన తీరు, అందువల్ల దక్షిణ భారతదేశంలో ఏర్పడిన సామాజిక, రాజకీయ ఒడిదుడుకులూ, చారిత్రక అన్యాయాలూ - తెలుగు భాషనూ, తెలుగు ప్రజలనూ కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇందుకు కారణం - తెలుగువారికి తొలినుండీ సరైన సామాజిక, రాజకీయ నాయకత్వం లేకపోవడం. ఏనాడూ భాషా సాంస్కృతిక స్పృహగాని, చైతన్యంగాని లేని నేతలే ఆంధ్రప్రదేశ్ పాలిట దాపురించారు. అనేక సామాజిక చారిత్రక కారణాలవల్ల తెలుగువారిలో జాతి భావన ఏర్పడలేదు. సమైక్య జీవనానికి మారుగా - కుల భావనలు, స్వార్థం శృతిమించాయి. భాషా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మన ప్రాణావసరమైన మాతృభాషను ఆధారంగా చేసుకొని ఒక భాషాజాతిగా ఎదగాలనే ఇంగిత జ్ఞానం లేకపోయింది. బయటి రాష్ట్రాల్లో మిగిలిపోయిన తెలుగువారికి అండదండలనందించాలనే ఆలోచనే నాటికీ నేటికీ మృగ్యమైంది.

తెలుగును 1 నుండి 10 వ తరగతి వరకు పాఠశాలలో కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే నేర్పుతామని రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ ప్రకటించేశారు. కేజీ నుండి పీజీ వరకు ఇంగ్లీష్ మాధ్యమమే మనకు దిక్కూ దారీ అని రెండు ప్రభుత్వాలూ నిర్ణయించేశాయి. అంటే - 'నేను తెలుగు వాణ్ణి, నా భాష తెలుగు అని గర్వంగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి' అని మన భావితరాకు నేర్పుతున్నామన్నమాట. ఉపయోగించే కొద్దీ వికసించడం ఏ భాషకైనా స్వభావ లక్షణమనీ, ఎంతో సాహిత్యం, చరిత్ర కలిగిన తెలుగు అత్యంత ఆధునిక భాషగా అన్ని అవసరాలకూ పనికొస్తుందనీ ఒక పక్కన విజ్ఞులు ఘోషిస్తున్నా, పెడచెవిన పెడుతున్న మన ప్రభుత్వ నేతలు - జనాభా లెక్కల్లో తెలుగుజాతికి అన్యాయం జరుగుతున్న తీరును ఎందుకు పట్టించుకుంటారు?!

(8 - 11 పుటలలోని రెండు వ్యాసాలను తప్పక చదవండి)

సామల రమేష్‌బాబు

తేదీ: 30-6-2018

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *

జూలై 2018

7