పుట:Ammanudi july 2018.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుగు జనాభా

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు
9866128846

2011 మాతృభాషల జనాభాలెక్కలు

తెలుగు నిలదొక్కుకునేదెలా....

2011 వ సంవత్సరంలో సేకరించిన భాషలకు సంబంధించిన జనాభా లెక్కలు చివరకు ఇంకా ఈ దశాబ్దం గడవడానికి ఏడాదిన్నర ఉందనంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ భారత జనాభా లెక్కల సంస్థవారువిడుదలచేశారు. కింద చూపిన పట్టిక (సేకర్త, కొలిచాల సురేశ్, తెలుగు భాషా వేదిక, తెలుగుబలగంలోకి ఎగుమతి చేసినది). ఈ పట్టికలో చూపిన కొన్ని భారత భాషల లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎంత మంది ఏ భాషను మాట్లాడుతున్నారో 1971 నుండి 2011 వరకు జరిగిన జనాభా లెక్కలలో తేలిన గణాంకాల సారాంశం ఉంది. ఇందులో హిందీ తప్పించి అన్ని భాషలూ కొద్దోగొప్పో తరుగుతున్నా హిందీ బాగా పుంజు కొంటోంది. తెలుగూ మలయాళ భాషల జనాభా బాగా తగ్గుతోంది. అని తెలుస్తోంది. ద్రావిడ భాషల జనాభా తగ్గుముఖం పట్టాయి అని కూడా చెబుతోంది. దీనికి రెండుమూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి -ప్రతి దశాబ్దపు జనాభా సేకరణలోనూ మాతృభాషల సంఖ్య ఒకటి తగ్గిపోతోంది అని తెలుస్తోంది. అంటే 10వేలకంటే తక్కువ మాట్లాడే జనాభా ఉన్న భాషలనూ మరికొన్ని చిన్నా పెద్దా భాషలను ఆయా భాషా సమూహాలకిందజమకట్టేయడం జరుగుతోంది. ఉదాహరణకు షుమారు 40కి పైగా భాషలు (రాజస్థానీ, ఛత్తీస్గఢీ, భోజపురి, పహాడీ, మైథిలీ, మగధీ లాంటివెన్నింటినో హిందీ కింద జమవేయడం. అంటే హిందీ ఒక పెద్ద భాషా సమూహానికి మారు పేరుగా మారిపోయింది. అట్లాగే ఆయా రాష్ట్రాలలో మాట్లాడే జన్యుసంబంధం కలిగిన మరికొన్ని అల్పసంఖ్యాక భాషలను ఆయా రాష్ట్రభాషలలో కలిపి లెక్క చూపించడం జరిగింది. ఇంకొక కారణం - దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువగా నమోదు కావడం కావొచ్చు. ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సాధారణ జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ. మూడవది - మన దేశ రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న మైనారిటీ లేక అల్పసంఖ్యాక భాషల రక్షణ హక్కులను పట్టించుకోకపోవడం. ఈ భాషా హక్కుల హరణం తెలుగుపై కోలుకోలేనివిధంగా దెబ్బతీస్తోంది. ఉదాహరణకు తమిళనాడులో 1971 వరకు వందలాది తెలుగు బడులు ఉండేవి అవి మెల్లమెల్లగా పూర్తిగా మూసివేతకు గురయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ టూ పీజీ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంలాంటి చర్యలు మరే రాష్ట్రంలోనూ కనబడవు. తెలుగు రాష్ట్రాలలోనే తెలుగుకు సరైన గుర్తింపు లేనపుడు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు ఇంకా తెలుగును నిలుపుకునే ప్రయత్నం ఎలా చేయగలం?!

క్ర.సం ఏడాది/భాష హిందీ% తెలుగు% బంగ్లా% మరాఠీ% తమిళం% కన్నడ% మలయాళం%
1 1971 36.99 8.16 8.16 7.62 6.88 3.98 4.00
2 1981 38.74 7.61 7.71 7.43 6.50 3.86 3.86
3 1991 39.29 7.87 8.30 7.45 6.32 3.91 3.62
4 2001 41.03 7.19 8.11 6.99 5.91 3.69 3.21
5 2011 43.63 6.70 8.03 6.86 5.70 3.61 2.88

తెలుగు నిలదొక్కుకొనేందుకు ఇది చివరి అవకాశమే. నిజమే లేకపోతే తెలుగు కనుమరుగు అవటం కూడా ఖాయం. ఇదీ నిజమే. అయితే ఈ సందర్భంలో తెలుగువాళ్లు ఉన్నంతకాలం తెలుగు ఉండాలనుకొనేవాళ్లు ఏం చేయాలి అన్న దానిమీద సరైన అవగాహన ఉండాలని నా అభిప్రాయం. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ టూ పీజీ ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎంతో మంది తెలుగువాళ్లు తమ బాధను దిగమింగుకొని ముక్కున వేలేసుకొని నిస్సహాయంగా చూస్తుండగా, కొంతమంది తమగోడునూ, వ్యధనూ, వేదననూ, ఆవేదననూ, ఆక్రందనాలనూ అభిప్రాయాలుగా అనేక రూపాలలో అంతర్జాలంలోనూ, సామాజిక జాలికావలయాలైన ట్విటర్‌ల, ఫేస్‌బుక్‌‌లోనూ, వివిధ పత్రికలలో వ్యాసాల రూపంలోనూ బయట పెట్టుకుంటున్నారు. ఇందులో కొంతమంది తెలుగు వర్ణమాలలోని అక్షరాలను పెంచాలనో తగ్గించాలనో, సరిచేయాలనో సూచిస్తూండగా, మరికొందరు తెలుగు పారిభాషిక పదాల రూపకల్పనకు సూచనలను చేస్తున్నారు. ఇంకా మరికొందరు తెలుగుపదాలలోని సంస్కృత, ఆంగ్ల పదాలను ఏరివేయాలనీ వాటి వాడకాన్ని నియంత్రించాలనీ సంస్కృత ఆంగ్ల ప్రభావాలను ఎటువంటివాటినైనాసరే సుతరామూ ఒప్పుకోగూడదనీ పట్టు బట్టుతున్నారు. ఇకనైతే కొందరు ఏ మాండలికం

8

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018