పుట:Ammanudi july 2018.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అమ్మా! ఆకలేస్తోంది... అన్నం పెట్టు...హడావిడిగా ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ అమ్మనడిగాడు. అప్పుడు తనకి అయిదేళ్లుంటాయి.

“ఆకలేసిన తర్వాత అమ్మ, ఇల్లూ గుర్తుకు వచ్చాయా నాన్నా!” కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ లాలిస్తూ అడిగింది అమ్మ.

అమ్మ మాటకి ఏమని జవాబు చెప్పాలో అర్థంకాలేదు కృష్ణకి. “అది కాదమ్మా... మన వాకిట్లోనే ఆడుకుంటున్నాం నేను, మన పక్కింటి రాజు...” తడబడ్డాడతను.

అమ్మమాటతో “ఇంకెన్నాళ్ళులే నీ ఆటలు! వచ్చే నెలలో స్కూల్‌కి పంపిస్తాంగా!" నవ్వుతూ అమ్మ మామూలుగా అన్నా తన మనసు చివుక్కుమంది.

వచ్చే నెల నుంచి తనిలా ఆడుకోలేడా?

స్కూల్లో చదువు చెప్పే మాస్టారు చదువుకోకపోతే కోప్పడతారట?

స్కూల్‌లో ఆయన పక్క పిల్లలతో కూడా మాట్లాడుకోనివ్వరట! ఎప్పుడు 'ఇంకా చదువు' అంటూ కోప్పడుతూనే ఉంటారట. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆడుకోవడానికి వీల్లేకుండా బోల్డంత హోమ్‌వర్క్ ఇస్తారట!

స్నేహితుడు రాజు వాళ్ళన్నయ్య మురళి చెప్పిన మాటలు చటుక్కున గుర్తుకు వచ్చాయి తనకి.

“ఏమిటాలోచిస్తున్నావ్ కంచంలో అన్నం పెట్టాను. కాళ్ళు, చేతులు కడుక్కుని రా...” అమ్మ వంటింట్లోంచి కేక వేయడంతో ఆలోచనల్ని తాత్కాలికంగా విరమించుకుని పెరట్లోకి పరుగెత్తాడు తను -

మొదటి రోజు స్కూల్ కాగానే “మమ్మీ” అంటూ తను బాగ్‌తో పరుగెత్తుకొచ్చాడు ఆనందంగా.

అమ్మ జవాబియ్యలేదు. తన ఆనందం మీద తల్లి నీళ్ళు పోసినట్లు జావగారిపోయాడు!

“మమ్మీ!” తేరుకుని మళ్ళీ ఆనందాన్ని పుంజుకుంటూ అమ్మ దగ్గరకు చేరాడు తను.

అమ్మ.... అమ్మ మాట... అమ్మ భాష... అమ్మ దేశం... అన్నింటికి దూరంగా తనింకెన్నాళ్ళు ఉంటాడు? తిరిగి మాతృదేశం వెళ్ళి పోవాలి. మాతృభాషలో మాట్లాడుకోవాలి. తననింతటివాణ్ణి చేసిన 'అమ్మ రుణం' తీర్చుకోవాలి. నేను పెరిగినట్లే నా పిల్లలూ అమ్మ మాటతోనే పెరగాలి. మమ్మీ డాడీల సంస్కృతితో కాదు!

36

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018