పుట:Ammanudi july 2018.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సన్నిధానం నరసింహశర్మ

9292055531

దీక్షాదక్షతలు గల పనిరాక్షసుడు

వడ్లమూడి గోపాలకృష్ణయ్య

వ్యావహారిక ఆంధ్ర భాషా వ్యాకరణం రాసిన పండిత కవి వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు. హైదరాబాదులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంకి వెళ్ళి ఆ సంస్థకు సంచాలకులుగా చేసిన వారి పట్టిక చూస్తే రాష్ట్ర వ్యాప్త కీర్తిమూర్తుల పేర్లు దర్శనమిస్తాయి. అందులో వడ్లమూడి వారి పేరు ఒకటి. ఆయనకు రాజమంద్రంలోని అద్దేపల్లి నాగేశ్వరరావు అద్దేపల్లి వివేకానందాదేవిగార్ల సరన్వతీ ప్రెస్సుతో, అద్దేపల్లి ప్రచురణలతో మంచి సంబంధాలుండేవి. అద్దేపల్లి అండ్‌కో వారు వడ్లమూడి వారి కొన్ని పొత్తాలు అచ్చొత్తించారు వెలువరించారు. అద్దేపల్లివారికి ఆంతరంగిక ఆలోచనా మార్గదర్శకత్వాల్లో పురిపండావారి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటివారి పాత్ర వుండేది.

సరే అది అలా వుంచితే - ఒక సందర్భాన వడ్లమూడి గోపాలకృష్ణయ్య గౌతమి పొత్తపు గుడికి విచ్చేశారు. నేను గ్రంథ భాండగారిని. పొత్తాల కెరటాలపై కొంతసేపు ఈదులాడి ఆయన - సన్నిధానం... ఈ వూళ్ళో ఆర్‌. ఎమ్‌. చల్లా అనే అరుదైన పండితుడు, బహు భాషాభిజ్ఞుడూ వున్నారు. ఆయన ఇంటికి తీసికెళతావా? అన్నారు. పని వేళల్లో గ్రంథాలయ కార్యాలు చూడ్డం- తరువాత విచ్చేసిన సందర్శక ప్రముఖులతో పెద్దల ఇళ్ళకు వెళ్ళడం, ఇంట్లో ఇంకా తిండికి రాలేదని తిట్లు తినడం. ఇవన్నీ నాకు మామూలే, నరదాలే. సరే దానవాయి పేట పార్కు ప్రక్కన అద్దేపల్లి వారింటికి సరిగ్గా ఇవతలే వున్న చల్లా రాధాకృష్ణమూర్తిగారింటికి వర్లమూడి వారిని తీసుకుని వెళ్ళాను.

ఆర్‌. ఎమ్‌. చల్లా ఒక విచిత్ర వ్యక్తి సమయపాలనకు పెట్టింది పేరు. పది నిముషాలు మాట్లాడడానికి కేటాయించారంటే ఆ సమయం అయిపోతే ఆయన ఇంటి మెట్లనుండి కిందికి దిగిపోతాడు. వెళ్ళిన వాళ్లం వారి ఇంట్లో వుండం కదా,- మనమూ దిగి వచ్చేస్తాం. అటువంటి కాలజ్ఞాని వడ్లమూడి వారికి చాలా సేపు కేటాయించారు. అప్పుడు గోపాల కృష్ణయ్యగారు 'మీ ఆంగ్ల కవిత్వాన్ని మీ నోట వినాలని వచ్చాను. అన్నారు. అనగానే అదినాకూ ఒక అవకాశం అంటూ చల్లా మా ఎదురుగుండా లోపల గదిలోకి వెళ్ళి తలుపు భళ్ళున వేసుకున్నారు. వడ్లమూడివారూ నేనూ ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటుండగా - ఎదుట గదిపైభాగాన అమర్చబడిన శ్రవణ యంత్రం ద్వారా తమ కవిత్వాన్ని ఆడియో ద్వారా వినిపించారు. తరువాత సాలార్జంగ్‌ మ్యూజియంలో గడియారపు బొమ్మలా బయటికి వచ్చి 'హౌ ఈజ్‌ మై పొయిట్రీ మిస్టర్‌ వడ్లమూడీ!' అన్నారు, చల్లాగారు. మీ కవిత్వాన్ని మీ నుండే వినాలని వచ్చాను అన్నారు వడ్లమూడి. అవును నా నుండే నా గొంతునుండే విన్నారు. నా శరీరం ద్వారా ఎదురుగా వుండి వినిపించడం కన్నా నా గొంతు ద్వారా కేవల శబ్దగతంగా మీకు వినిపించడమే మంచిది. మధ్యలో ఈ శరీరం కనపడక్కర్లేదుగా అన్నారు చల్లా. అవాక్కయ్యారు వడ్లమూడివారు. బయటకు వచ్చేస్తున్నప్పుడు - సన్నిధానం, మీ వూళ్ళో పండితులు చాలా చిత్రమైన వాళ్లే అన్నారు. అబ్బుర పాటుతో.

వేదాలను అనుసరించడం మాట అల్లా వుంచితే అందులో ఏమున్నాయో తెలుసుకోవడం జ్ఞానదాహానికి సంబంధించింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన 'రికార్డులు' గా మాక్సుముల్లర్‌ నోటబలికాడు. మళ్ళీనాకు జన్మ అంటూ వుంటే వేదాలు, ఉపనిషత్తులు పుట్టిన భారతదేశంలో పుట్టాలని వుంది - అది రాసుకున్నాడు.

వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారికి పండితునిగా, రచయితగా ప్రముఖ కీర్తి వుంది. ఆయనలో మనం గ్రహించవలసిన మరో గొప్పకోణం వేద పరిశోధన, వేదజ్ఞానాసక్తి.

ఉత్తరాంధ్రకు చెందిన కళ్ళికోటలో కళాశాలా పండితుడుగా పనిచేసిన నేమాని వేంకట నరసింహశాస్రిగారు యావత్తు ఋగ్వేదాన్ని సరళ సుబోధక శైలిలో పద్యానువాదంగా చేశారు. ఆ మహానుభావుడు కొన్ని సంపుటాలుగా రాసిన ఆ అనువాద వ్రాత ప్రతులు కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భద్రపరచబడినాయి. తరువాత పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి పుణ్యమా అని ఆ రాత ప్రతులన్నీ శ్రీ గౌతమీ గ్రంథాలయానికి చేర్చబడి చాలాకాలం అచ్చుకు నోచుకోక ఎదురు చూపులతో ఉండిపోయాయి. మహీధర జగన్మోహనరావు కొన్ని మచ్చు పుటలు వేసి అచ్చు అవసరాన్ని తెలుపుతూ కరపత్రాలు పంచారు. ప్రధమ ప్రపంచ తెలుగు మహానభల్లో. అముద్రిత ఆంధ్రీకృత ఋగ్వేద సంహిత రాత ప్రతుల అచ్చు ఆవశ్యకతపై నేను కొన్ని దిన పత్రికలకు లేఖలు కూడా రాశాను. పందిరి మల్లికార్జునరావు తమ 'సుభాషి' పత్రికలో నేమానివారి వేదానువాద పద్యాలు కొన్ని ప్రకటించారు కూడా. రెవరెండ్‌ కె. ప్రశాంతకుమార్‌ అధ్యక్షునిగా గౌతమీ గ్రంథాలయ నిర్వహణ వున్న కాలంలో వడ్లమూడి వారు ఆ రాత ప్రతుల్ని చూశారు. పాలక వర్గంతోనూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారితోనూ అనుసంధాన కృషి చేశారు. బేరం రామస్వామి అనే కలప వర్తకుడు, గౌతమీ గ్రంథ కోశాధికారి, పాలక వర్గ సభ్యుడు, పత్రికా విలేఖరి కంచుమర్తి శ్రీరాములు ఋగ్వేద పద్యానువాద వ్రాత ప్రతుల్ని శిరోధార్యం చేసుకుని తిరుపతి తీసుకెళ్ళడం మరపురానిది. తెన్నేటి విశ్వనాధం వంటివారూ రాత ప్రతుల అచ్చు అవసరాన్ని ఉద్ఘాటించేవారు.

వడ్లమూడి వారిని వేద పరిశోధకుడనడానికి శషభిషలు అనవసరం.

ఇంతింత లావుపాటి పెద్ద సైజు నంపుటాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు నేమాని వారి శ్రీమదాంధ్రీకృత పద్య ఋగ్వేద సంహితను లక్షల ఖర్చుతో వేసినవి చూస్తూంటే - ఆ అచ్చు సంపుటాలు కాక అచ్చమైన దీక్షా దక్షతలతో ఒక పనిరాక్షస కృషే దర్శనమిస్తుంది. ఆ దర్శనంలో వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఆత్మదర్శనం కూడా వుంది.

ఓ సందర్భంలో హైదరాబాదు చిక్కడపల్లిలో వడ్లమూడి వారింటికి వెళ్ళాను. ఆశ్చర్యం - వడ్లమూడి వారు కుటుంబ సభ్యుల మధ్య నుండి పద్య ఋగ్వేదం అచ్చు కాగితాల్ని చదువుతున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆయన కృషి భాగస్వాములై చుట్టూ కూర్చున్నారు.

పుస్తకాల ముద్రణ అయ్యాక నేను ఆయనను కలసినప్పుడు ఆ

(తరువాయి 37వ పుటలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

35