పుట:Ammanudi july 2018.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్రాల్లోని గ్రంథాలయాలు దాదాపుగా శిధిలాలయాలుగా మారిపోయి వున్నాయి.

విద్య, పుస్తకాలు, గ్రంథాలయాల వంటి అంశాలు లాభకరమైనవిగావని యిప్పటి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అనేక రంగాల్లో ప్రజాధనం దుర్వినియోగమవుతున్న తీరును గమనిస్తున్నప్పుడు యీ నిర్లక్ష్యం మరింత విషాదకరమని గుర్తించి తీరతాం. ఆరేడేళ్ళకు పూర్వం “రాజా రాంమోహన్‌రాయ్‌ ఫౌండేషన్‌' పేరుతో ప్రభుత్వాలు కేంద్రం నుంచీ సొమ్ముతో కొన్ని పుస్తకాలు యెన్నిక జేసి వందల సంఖ్యలోకాని, గ్రంథాలయాలకు సరఫరా చేసేవి.

తమిళ, కన్నడ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరమూ ఆయా భాషల్లో ప్రచురించబడే పుస్తకాలను రెండు మూడు వందల ప్రతుల వరకూ కొని గ్రంథాలయాలకు పంపిణీ చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రంథాలయాలు చితికి పోయాయి. మలయాళంలో యివ్చుడు గూడాయే పుస్తకమైనా ప్రథమ ముద్రణ కనీసం అయిదువేల ప్రతులుంటాయి. ప్రసిద్ధమైన వో గ్రంథాన్ని రాసిన రచయిత దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం గూడా సాధ్యమేనంటారు. రెండు రాష్ట్రాల్లోనూ కలసి దాదాపు తొమ్మిది కోట్ల మందీ, రాష్ట్రాల కవతల మరో తొమ్మిది కోట్ల మందీ, వెరశీ 18 కోట్ల వరకూ వున్న తెలుగు ప్రజల భాషలో యిప్పుడు ప్రసిద్ధ రచయితలూ, కవులూ గూడా 500 ప్రతులు వేయడం గూడా భారమేనను కుంటున్నారు.

తన ప్రసిద్ధమైన గ్రంథం “వాల్డన్‌"లో ప్రముఖ అమెరికన్‌ రచయిత తోరో షేక్స్‌పియర్‌, మిల్టన్‌ రచనలకంటే ముఖ్యమైన వార్తా పత్రికలేముంటాయని ప్రశ్చిస్తాడు. మానవ విజ్ఞానమంతా పుస్తకాలలోనే వుంది. యెన్ని సాంకేతిక విప్లవాలు వచ్చినా వుస్తకానికి మాత్రం ప్రత్యామ్నాయ ముండదు. పాఠకుల సంఖ్య తక్కువగా వుందంటే ఆ జాతి సాంస్కృతికంగా తక్కువ స్థాయిలో వుందనే అర్థం. యిప్పటికైనా విద్యార్థులూ పాఠకులూ తల్లిదండ్రులూ వుపాధ్యాయులూ ప్రభుత్వాలు మేలుకుని పాఠకుల సంఖ్యను పెంచుకోక పోతే యే రంగంలోనైనా పురోభివృద్ధి సాధ్యం కాదు.

కవిత

పూలు సుగంధాలనే విరజిమ్మాలి

సముద్రం అల్లకల్లోలమవుతోంది.
అనంతమైన కల్మషంతో కొట్టుమిట్టాడుతోంది.
భూమి వేడెక్కి బీటలు వారుతోంది
రోడ్లతారు కరిగిపోతోంది.
అంతా నిర్మానుష్యం
భానుడు నడిరోడ్డుమీద నిద్రిస్తున్నాడు
కుళాయిలో వస్తున్న నీరు కూడా
కాలిపోతోంది

మత్తుపానీయాలు కాలేయానికి
చిల్లులు వేస్తున్నాయి
మనిషి ఏదో ఒక మత్తులో
బ్రతకాలని చూస్తున్నాడు
తన్నుతాను మోసం చేసుకొంటున్నాడు,
డ్రగ్స్‌ తీసుకొన్నవారు
ఇంద్రలోకాల్లో తిరుగుతున్నారు
ఆడా మగా అంతా పబ్బుల్లో గంతులేస్తున్నారు
గుక్కగుక్కకి కిక్కెక్కి తూలిపడిపోతున్నారు
యుక్త వయస్సులోనే
ఓడ్కాలు, విస్కీలతో శరీరాన్ని
విషపూరితం చేసుకొంటున్నారు
సంతానోత్పత్తి సామర్ద్యా న్ని
విచ్చిన్నం చేసుకొంటున్నారు
శని, ఆదివారాలంటే వినోదించే రోజులా!
జీవితానికి నిర్మాణం లేదా!
ఎవ్వరితో జీవితం పంచుకొంటున్నారో
వారి మీద నమ్మకం లేదు
జీవితం పంచుకొనే వారు ఒకరు
పెళ్ళి మరొకరితోనా?!
సంపదను పెంచుకోవడానికి
శరీరాన్ని ఫణంగా పెట్టడం ధర్మమా!
ఖండాంతరాలు దాటి షాపింగ్‌ లెందుకు?
జీవితం ధ్వంసం అయ్యాక
బంగారం ఎంత వుంటే ఏమిటి?
ఎన్ని సుఖాలు పొందినా

ఏదో 'ఫ్రస్టేషన్‌' లో బ్రతుకుతున్నారు
మానసిక రోగాలు పెరుగుతున్నాయి
మత్తు పోగొట్టే సెంటర్లు పెరుగుతున్నాయి

గ్రంథాలయ సంస్కృతిని ధ్వంసం చేశారు
జ్ఞాన జ్యోతులను ఆర్పేస్తున్నారు
నాలుగు అక్షరాలు బట్టి పట్టడం
చదువు అంటున్నారు
ప్రతి మనిషిలో ఓ వివేచన ఉంటుంది
దానికి పదును తగ్గుతోంది
ధనం పెరిగే కొద్దీ వ్యసనాలు పెరుగుతున్నాయి.
వేర్లు బలహీనంగా ఉండి
చెట్లు కూలుతున్నాయి.
నదుల నడిబొడ్డులో విషం పారుతోంది
పూలు కూడా దుర్గంధాన్నే చిమ్ముతున్నాయి
సందిగ్ధంలో మనుషులు బ్రతుకుతున్నారు
ఎవరిమీదా నమ్మకం లేదు
ఏ విషయం మీదా సమగ్రత లేదు
ఏ విషయాన్నీ వినే అలవాటు లేదు
ఏ అంశాన్నీ తేల్చుకోలేరు
మనుషులు ద్వంద్వత్వంలో వున్నారు

నిజమే! మరో ప్రక్క
చైతన్యం వెల్లి విరుస్తోంది
హిమాలయాలను
అలవోకగా ఎక్కుతున్నారు
సామర్ధ్యానికి నిరంతరం
పదును పెడుతున్నారు
కక్షా, కార్పణ్యాలను దాటి
కారుణ్య సముద్రులవుతున్నారు
సేవా సంస్కృతితో
ఉజ్బల భవితవ్యానికి దారులు నిర్మిస్తున్నారు
అవును! ఎప్పటికైనా మనిషే విజేతక!
మానవత్వమే జీవన సత్యం
పూలు సుగంధాలనే విరజిమ్మాలి...
అప్పుడే మనిషి ప్రకృతికి వికాసం

డా॥ కత్తి పద్మారావు.

9849741695

26

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018