పుట:Ammanudi july 2018.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్ప ధ్వనిఅనుకరణ కళాకారుడు తెలుగువారి కీర్తి కిరీటం

నేరెళ్ళ వేణుమాధవ్

భాషలోని వివిధ పలుకుబళ్ళను యాసలను సామెతలను, జోక్స్‌ను ఆయన ప్రదర్శించే విధానం తెలుగు భాషలోని అనేక వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేది. ఆయనకు తెలుగంటే విపరీతమైన అభిమానం ఉండేది ఎన్ని మాండలికాలున్నా ఎన్ని యాసలున్నా తెలుగుభాష ఒక్కటే అనే వాస్తవాన్ని ఆయన అనేకసార్లు చెబుతుండేవాడు.

జూన్ 19 మంగళవారం నాడు 11-30 గంటలకు విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‌గా ప్రసిద్ధుడైన నేరెళ్ళ వేణుమాధవ్‌గారు వరంగల్‌లో తన స్వగృహంలో చివరిశ్వాస విడిచాడన్న వార్త విన్నప్పుడు వరంగల్ నగర ప్రజలంతా తమ కుటుంబంలోని ఒక ఆత్మబంధువే ఈ లోకం లోంచి శాశ్వతంగా వెళ్లిపోయాడని దుఃఖించారు.

నేరెళ్ళ వేణుమాధవ్‌తో నాకు 40 యేళ్ళ స్నేహం ఉంది 1958లో నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మొదటిసారి ఆయన మిమిక్రీ ప్రదర్శనను చూశాను. ఆనాటి నుండే నేనాయనకు అభిమానినైపోయాను 1966లో నేను నల్లగొండ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్లో నేనాయన్ను ఆ కాలేజీలో జరిగే వార్షికోత్సవానికి ఆహ్వానించాను. అప్పుడాయనతో ఒకరోజంతా గడిపే అవకాశం కల్గింది అప్పట్నించే నాకాయనతో స్నేహం ప్రారంభమైంది ఆ స్నేహం క్రమంగా బలపడ్తూ వచ్చింది 1982లో నేను వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాక మేమిద్దరం తరచూ కలుసుకునేవాళ్ళం 2001లో ఆయన 'నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు' అనే సంస్థను స్థాపించినప్పుడు దానికాయన అధ్యక్షుడయ్యాడు నాకు చాలా ఆశ్చర్యం కల్గించిన విషయమేమి టంటే ఆ ట్రస్టుకు నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించటం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కార్యదర్శిగా నియమించండి అని నేనెంత పోరాడిన "ఆయన మీరే ఉండాల"ని పట్టుబట్టారు ఆయన మాటను నేను కాదనలేక నేను నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టులో శాశ్వత సభ్యుడుగానూ ప్రధాన కార్యదర్శిగానూ ఉండటానికి అంగీకరించాను.

నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు యేర్పడినప్పట్నించి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు - అంటే డిసెంబర్ 28 నాడు వరంగల్‌లో పెద్ద కార్యక్రమం జరుగుతుంది భారతదేశమంతా ఆరోజును "మిమిక్రీ డే"గా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా ఉన్న మిమిక్రీ కళాకారులంతా ఆరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అప్పుడప్పుడే మిమిక్రీ నేర్చుకుంటున్న ఔత్సాహిక కళాకారులకు మిమిక్రీ పోటీలు నిర్వహిస్తారు అలాగే ఆరోజు సాహిత్యం సంగీతం చిత్రలేఖనం రంగస్థలం లాంటి లలితకళల్లో విశేష కృషి చేసిన ఉద్దండులకు 10 వేల నగదుతో ఘనంగా సన్మానం చేస్తారు ఇలా ప్రతి డిసెంబర్ 28 నాడు వరంగల్ నగరంలో రోజంతా - ఉదయం నుండి రాత్రి పదిగంటల వరకు మిమిక్రీ సంబరాలు జరుగుతాయి వేణుమాధవ్‌కు కొన్ని వేలమంది శిష్యులున్నారు. మిమిక్రీ శ్రీనివాస్, ఆంథోనిరాజ్, హరికిషన్, జానీలీవర్, జూనియర్ వేణుమాధవ్ లాంటి ఎందరో లబ్ధప్రతిష్టులైన మిమిక్రీ కళాకారులు డిసెంబర్ 28 నాడు తప్పనిసరిగా వరంగల్‌కొచ్చి వేణుమాధవ్ పుట్టినరోజు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు

మిమిక్రీ కళాకారుడుగా వేణుమాధవ్ ప్రపంచమంతా మూడుసార్లు తిరిగొచ్చాడు ఎన్నో దేశాల్లో ఆయన తన మిమిక్రీ ప్రదర్శనలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ నవ్వుల్లో ముంచెత్తేవాడు ఆయన మన తెలుగునాడులో మిమిక్రీ ప్రదర్శనలిచ్చినప్పుడు తెలుగుభాష ఎంత తియ్యని బాషో ఉదాహరణలతో చెబుతుండేవాడు

ఆయన ఎన్నోసార్లు పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలోని ఒక ఘట్టాన్ని పోతన ఎలా వర్ణించాడో చాలా అద్భుతంగా, వింటున్నవాళ్ళను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ చెప్పేవాడు. ఆ ఘట్టం యేమిటంటే హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వధించిన ఘట్టం హిరణ్య కశిపుడు స్తంభాన్ని తన గదతో ఢీకొట్టినప్పుడు ఆస్తంభం బ్రద్దలై దాంట్లోంచి చాలా భయంకర రూపంలో నరసింహుడు బయటకొచ్చి హిరణ్యకశిపుడిని వధించిన ఘట్టాన్ని పోతన్న ఇలా వర్ణించాడు

"ఇట్లు దానవేంద్రుండు, పరిగ్రహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్య మానవతామసుండును రామసగుణ చంక్రమ్యమాణ సైర్యుండునునై, విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి,

14

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018