పుట:Ammanudi july 2018.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు భాషకు ఆధునిక హోదా - 6

నగరాలు పలు భాషల నగారాలు కావాలి

ప్రపంచ జనాభాలో సగం నగరాలలోని ఉన్నదని ఐక్యరాజ్యసమితి 2008లో ప్రకటించింది తాజా అంచనాల ప్రకారం 2030 సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 60% నగరాలలోనే నివసిస్తారనీ, 2050 సంవత్సరానికి ఇది 70 శాతానికి చేరుకోవచ్చనీ చెబుతున్నారు అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే 80 శాతం పైబడి నగరాలలో నివసిస్తున్నారు ఈ వృద్ధికి మామూలుగా జనాభా పెరుగుదలతోపాటు నగరాలకు వలసలు నగరీకరణలు దోహదం చేస్తున్నాయి

కోటిమంది కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలను మహా నగరాలు అని వ్యవహరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా 46 మహానగరాలు ఉంటే కేవలం భారతదేశంలోనే 6 ఉన్నాయి భవిష్యత్తు అంతా నగరాలదే. ఈ నేపథ్యంలో భాషల మీద పడే ప్రభావం పరిరక్షణ గురించి అంశాలతో ఈ వ్యాసం

నగరాలలో జనాభాలో అధిక శాతం (వారో వారి పూర్వీకులో) వలసలుగా వచ్చినవారే అయివుంటారు తత్ఫలితంగా నగరాలు భిన్న సంస్కృతులు విభిన్న భాషల సమ్మేళనాలు కాలక్రమేణా ప్రతీ నగరానికీ దానికంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడుతుంది పాలన ఏదో ఒక భాషకి పరిమితమవుతుంది

నగరాలలో మరో వింత పోకడ: ఒకవైపు ఆకాశహర్మ్యాలు మరోవైపు మురికి వాడలు (ఎవరో రచయిత అన్నట్టు అత్యంత ధనికుడూ, అతి పేదవాడూ నగరంలోనే ఉంటాడు.) ఈ విభజన కూడా ఆ నగర భాషాసంస్కృతులపైప్రభావం చూపిస్తుంది.

నగరాలలో దాదాపు చాలా వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండి తీరిక లేని పరిస్థితే కనిపిస్తుంది. ఉరుకులు పరుగులు నిత్యకృత్య మవుతాయి అందువల్ల భాషాసంస్కృతులపట్ల ఆసక్తి చూపించేవారూ, అందుకు సమయం కేటాయించేవారూ జనాభాలో అతి కొద్దిశాతమే ఉంటారు అధికాదాయ వర్గాలు తగినంత తీరికసమయంతో ఉన్న వారి ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయి. సగం పైన జనాభా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రోజుగడవడమే గగనం అన్న రీతిలో ఉంటారు

అటు నగర / పురపాలక సంస్థలు కూడా వేగంగా పెరుగుతూన్న జనాభాకి తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫల మవుతున్నాయి. స్వచ్ఛమైన గాలీ నీరూ అందేలా చూడడం, పారిశుధ్యం, వీధిదీపాలు, సాఫీయైన రహదారులు వంటి సేవల నిర్వహణే కుంటుతూ నడుస్తుంది కొండొకచో వీటిని ప్రయివేటు నిర్వహణలో కూడా నడిపిస్తున్నారు. ఈ స్థితిలో నగరంలోని ప్రజల భాషలకు, వారి సంస్కృతులకుఃనగరం లోను దాని బడ్జెట్టులోనూఃసముచిత స్థానం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం అనేవి ఊహకందని విషయాలుగానే ఉండిపోతున్నాయి ఏదో ఒక భాష (మరో అనుబంధ భాషతోనో) పాలన అంతా నెట్టుకొచ్చేయబడుతుంది జపాన్, చైనా దేశాల నగరాలలో అక్కడి స్థానికభాష చలామణి ఉంటే అదొక్కటే ఉంటుంది. ఇతర / పరాయి భాషలకు ఆదరణ ఉంటుందనుకోలేము. సింగపూర్ వంటి నగరాలు పలు భాషలను ఆదరిస్తూ ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాయి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల నగరాలలో అధిక శాతం జనాభా అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే తెలుగు ఉర్దూల తర్వాత హిందీ, రాజస్థానీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల వారే ఇందులో ఉంటారు వీరందరికీ ఆంగ్లం రాదు. అయినా, కార్యాలయాలు పాలనలోనూ ఆంగ్లానిదే భోగం కేవలం ఆంగ్లం, తెలుగు (కొన్నిచోట్ల ఉర్దూ) మాత్రమే కనబడే ఈ నగరంలో మీరందరూ 'సమాచారం అందుబాటు'కి బహుదూరంగానే ఉంటున్నారు. గల్ఫ్ నగరాలలో తెలుగువారి పరిస్థితీ ఇంతే దారుణంగా ఉంటుంది

కొత్త ఆశలు

1. న్యూయార్క్ నగరంలో 'లిటిల్ చైనా', మరికొన్ని నగరాల్లో 'చైనాటౌన్‌' వంటివి ఆయా ప్రాంతాలనుండి వలసవచ్చినవారు ఒకే చోట దగ్గరదగ్గరగా స్థిరపడి తమ ప్రత్యేకతతో నివసిస్తూంటే ఏర్పడిన

12

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018