Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

నంద్యాల నారాయణరెడ్డి 9360514800

సొతంత్రకాల సదువులు-11

ఎస్‌ ఎస్‌ ఎల్‌ సి తో నా చదువు ముగిసిపోయింది. ఈ కతలు అక్కడితో నిలిపేసి ఉండాలి. కానీ ఈ కడసీ (ఛివరి) కతను చెప్పే తీరాల అనిపించి చెప్తా ఉండాను. మా అబ్బ తీరిపోయినంక ఇంటికి పెద్దకొడుకుగా నా భుజాలమీద మోయలేనంత బరువు వచ్చిపడింది. ఏడెనిమిది నెలలు ఊర్లోసేద్యం పనులు చేస్తా రాటుదేలితిని. మా చిన్నబ్బల్లో ఒకాయనకు ఆవులంటే పంచప్రపాణాలు. మా వూరినింకా ఇరవై ఐదుమైళ్ల దూరములో ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో ఇరులోళ్లు అనే ఒక గిరిజన తెగకు చెందినవాళ్ల పల్లెలుంటాయి. వాటిలో ఒకటి రాగిపల్లి. పంటలకాలంలో మా ఆవులబ్బ (మాచిన్నబ్బను ఇట్లే పిలుస్తాము), ఆవుల్ని అక్కడే మేపుకొని తిరిగి వస్తుంటాడు. అట్ల ఫోతావస్తా ఉండే తపుడు ఆ రాగిపల్లి తావున కొంచెం చేను కొన్నాడు. ఆయనకు సేద్దెం పనులలో తోడుగా ఉండేకి 1960లో అడవిసీమకు పోయి, ఏడేండ్లు అక్కడనే ఉండిపోతిని. (ఇరులదొడ్ది బతుకులు అనే పేరుతో ఆ కతల్ని మన నడుస్తున్న చరిత్ర పత్రిక అచ్చువేసింది. )

ఆ ఏడేండ్లు హోసూరు తావున ఏమి జరగతా ఉండాయనేది నాకు తెలిసేదే లేదు. 1967లో నేను తిరిగి మా హోసూరు తావుకు వచ్చేసరికి శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడి ఉంది. తెలుగు ఉపాధ్యాయులైన ఇద్దరు గురుశిష్యులు మా తావునున్న రెండు నియోజక వర్ణాలలో స్వతంత్ర పక్షం తరపున నిలబడి ఉండారు. ఉద్దనపల్లి నియోజకవర్గం నుండి శ్రీ కె.ఎస్, కోదండరామయ్యగారు, హోసూరు నియోజకవర్గం నుండి వారి శిష్యుడైన బి. వెంకటస్వామిగారు.

“ఎట్లయినా మన హోసూరు తావును ఆంధ్రాలో కలపాలని కంకణం కట్టుకొన్నారంట కోదండరామయ్య మేస్టరు. మన ఓట్లన్నీ ఆయనకే వేయాల” మావూరి రచ్చబండ తావ ఎగుర్లాడతా చెప్పినాడు ఒక కోడెయీడు చిన్నోడు.

“అబ్బయ్యా రవంత నిదానించు, ఆ మహన్నబావుడు నిలబడి ఉండేది మన నియోజకవర్గంలో కాదు, ఉద్దనపల్లిలో. మనము ఆయన శిష్యుడైన వెంకటస్వామి మేస్టరును ఇక్కడ గెలిపించాల” ఒక పెద్దాయన, చిన్నోని దూకుడును అణచినాడు.

“ఈ అరవ అధికార్ల పెత్తనం జాస్తి అయితా ఉంది. నూరారు తెలుగు స్మూళ్లు వెయ్యారు తెలుగు ఊర్లూ లక్షాంతరం తెలుగు జనాలూ ఉండి కూడా ఆ పదిరవై మంది అరవ అధికార్లకు తలవంచాల్సి పడతా ఉంది. కాంగైసు ఏలుబడిలోనే ఇట్లుందే, అదేమో డిఎముక (డి.ఎం.కె.) పార్టీ అంట, దిగువసీమంతా ఆ పేరునే కలవరిస్తా ఉండాదంట, అదేమన్నా అధికారంలోకి వచ్చేస్తే మనపని ముగిసిపోతుంది. ఎట్లన్నా గాసిపడి ఆంధ్రాలో చేరుకొనేయాల. దాని కోసరమన్నా కోదండరామయ్యానీ వెంకటస్వామినీ గెలిపించాల” ఇంకొక పెద్దాయన గొంతెత్తి చెప్పినాడు.

మా నియోజక వర్గాల్లో తెలుగోళ్లము ఒక్కట్టు (ఐకమత్యం) చూపిస్తిమి. కోదండరామయ్య గారూ ఆయన శిష్యడు వెంకట స్వామి గారు శాసనసభ్యులుగా గెలిచిరి. ఆనందంతో పొంగిపొర్లితిమి మేమంతా. అయితే మా ఆనందం చానాకాలం నిలవలేదు.

1967లో మద్రాను రాష్టంలో డి.ఎం.కె. అధికారం మొదలయింది. ఎంగుం తమిళం ఎదిలుం తమిళం (అంతా తమిళం అన్నిటా తమిళం) అనే పెనుగొంతు మదరాసు రాష్ట్రమంతా మారుమోగింది. తెలుగు కన్నడ మలయాళ ఉరుదూ నుడులవారి గుండెల్లో ఏదో తెలియని అలజడిని రేపింది.

1967 ఆగస్టు నెల - మావూరినింకా లుదూరంలోని నల్లూరులో ఉండే స్కూలుకు పోయుండిన చిన్నోళ్లు మాపుసరి ఇంటికి వచ్చి ఆ వార్తను చెప్పిరి. అందరమూ రచ్చ దగ్గర కూడితిమి.

“ఎట్టప్పా ఇది, స్కూల్లో తెలుగులో ప్రార్దన చేయరాదంట, ఇంకమీదట తమిళ్ళోనే ప్రార్ధన చేయాల్నంట. ఏమప్పా చేసేది?”ఒక గొంతులో ఆందోళన.

“తెలుగు స్కూల్లో అరవం పాట పాడల్నా మనం పాడేదొద్దు. ఎవురొస్తారో రానీ చూస్తాము” ఒక గొంతులో ఆవేశం.

“నిన్న మొన్న హోసూరు న్మూల్లో ఇట్లే తిరగబడిరంట. పోలీసోళ్లు వచ్చి మేస్టర్లనంతా బెదిరించేసి పోయిరంట. ఊరికే ఎగుర్లాడి ప్రయోజనం లేదు. అవతలితట్టు ఉండేది ప్రభుత్వము. పెద్దోళ్లను కలిసి మాట్లాడాల. మన ఎమ్మెల్లేలను చూసి మాట్లాడాల” ఒక గొంతులో అనుభవం.

ఆ మరునాడే చదువుకొన్నవాళ్లం నలుగురయిదుగురం కలిసి ఎమ్మెల్లే గారిని చూసేదానికి హోసూరుకు పోతిమి. మా అట్లానే చానా ఊర్ల జనం వచ్చిండారు. మా ఎమ్మెల్లేలు ఇద్దరూ కలసి ప్రభుత్వానికి విన్నపం తయారించిరి. దానిని అందరికీ చదివి వినిపించిరి.

అనెంక ఒక మేస్టరు లేచి నిలబడి ఇట్ల మాట్లాడిరి.

“ఇక్కడ చదువుకొన్న చిన్నోళ్లు చానామంది ఉండారు. దయచేసి మన తావు చరిత్రను రవంత తెలుసుకోవాలని కోరుకుంటా ఉండాను. 1167 చదరపు మైళ్ల వైశాల్యముండే మన హోసూరు తావున సుమారు మూడున్నర లక్షలమంది తెలుగువాళ్లం ఉండాము. రెండువేల ఏండ్లకు ముందు మనతావు తెలుగుదొరలైన సాతవాహనుల ఏలుబడి కింద ఉండేది. అనెంక కూడా ఎందరో తెలుగు కన్నడ రాజులు మన నేలను ఏలిరి. విజయనగర రాజుల కాలంలో తెలుగే ఇక్కడి పరిపాలన భాష. క్రీ.శ. 1776 లో జరిగిన శ్రీరంగపట్న యుద్ధం తరువాత, కోలారు బెంగళూరు జిల్లాలు మైసూరు రాజ్యంలో కలిసిపోగా, వాటికి ఆనుకొనుండే హోసూరు ప్రాంతం తెల్లవాళ్ల చేతికి వచ్చి సేలం జిల్లాలో భాగమయింది. 1953 లో ఏర్పడిన ఆంధ్ర